కోదాడలో సెక్స్‌రాకెట్‌ కలకలం..!

Adultery Business  Mans Arrested  In Nalgonda - Sakshi

కోదాడలో వెలుగుచూసిన సెక్స్‌రాకెట్‌ కలకలం సృష్టిస్తోంది. ఆన్‌లైన్‌లో అమ్మాయిల ఫొటోలను అప్‌లోడ్‌ చేసి విటులను ఆకర్షిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వ్యభిచార నిర్వాహకుల వద్ద రెగ్యులర్‌ కస్టమర్స్‌ పేరుతో ప్రముఖుల ఫోన్‌నంబర్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం కోదాడలో హాట్‌ టాపిక్‌గా మారింది.

సాక్షి, కోదాడ : పట్టణ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో ఈ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అందివచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి  ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిఘాపెట్టి ..
కోదాడ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై  పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఉప్పందింది. దీనిపై నిఘా పెట్టిన ఖాకీలు శనివారం దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు రిమాండ్‌ చెయ్యడంతో పాటు బాలికలను నల్లగొండ రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లను పోలీసులు తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడినట్లు కోదాడలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిలో వాస్తవం లేదని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు నిప్పులేనిదే పొగరాదని ముక్తాయింపునిస్తున్నారు.

విటుల్లో పలువురు ప్రముఖులు?
నిందితుల వద్ద లభించిన సెల్‌ఫోన్లే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దానిలో ఉన్న నంబర్లు, వారితో తరచూ మాట్లాడిన వారి నంబర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేపనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన కొందరు ప్రభ్వుత ఉద్యోగులు, రాజకీయ నేతలు, పత్రికావిలేకరులు, వ్యాపారులు ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. తమ పేరు బయటకు రాకుండా పోలీసులను కాకా పడుతున్నారని, వారిపై పెద్దల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని  ఇక్కడ ప్రచారం సాగుతుంది.

పోలీసు కస్టడీలో నిందితులు
రెండు రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన నిందితులను కోదాడ పోలీసులు తిరిగి తమ కస్టడీకి తీసుకున్నారని సమాచారం. వారి నుంచి పూర్తి వివరాలను రాబట్టి ఈ రాకెట్‌కు  చెక్‌పెట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మా దృష్టికి కూడా వచ్చింది
కట్టకొమ్ముగూడెం రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాము. కానీ మా వద్ద వాట్సప్‌లో కొంత మంది ప్రముఖుల వివరాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ వాస్తవంగా మా వద్ద ఎలాంటి  సమాచారం లేదు. జరుగుతున్న ప్రచారంపై విచారణ చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తాం.  
– శ్రీనివాసులరెడ్డి, పట్టణ సీఐ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top