చంపింది దత్త పుత్రుడే..

Adopted Son Killed To His Father In Adilabad - Sakshi

ఎల్‌ఐసీ ఉద్యోగి హత్య కేసులో కొడుకు, మరో ముగ్గురి అరెస్ట్‌

పరారీలో మరో ఇద్దరు

ఆదిలాబాద్‌రూరల్‌: దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకే కాలయముడయ్యాడు. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ ఉద్యోగి గేడాం గోవర్ధన్‌ను అతని దత్తత కుమారుడు నితీన్‌తోపాటు నితిన్‌ అన్న మడావి లింగేశ్వర్, స్నేహితులు మెస్రం రాము, డి.అమర్, కుమ్రె సాహిర్, గేడాం పింటులు హత్య చేశారని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం మావల పోలీస్‌స్టేషన్‌లో ఆదిలాబాద్‌రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై అనిల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

దత్తత కుమారుడు నితిన్‌ వ్యవహర శైలి నచ్చకపోవడంతో తండ్రి గోవర్ధన్‌ నా వద్ద నుంచి వెళ్లిపో అని మందలించాడు. దీంతో నితిన్‌ అప్పటి నుంచి తండ్రితో గొడవ పడుతూవస్తున్నాడు. దత్తత తీసుకున్న తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోమన్నడంతో తాను ఆస్తి కోకొల్పోతానని భావించిన నితిన్‌ హత్యకు పథకం పన్నాడు. ఇదే విషయంపై నితిన్‌ సోదరుడు జైనథ్‌ మండలంలోని పెండల్‌వాడకు చెందిన మడావి లింగేశ్వర్‌తో చర్చించాడు.

సోదరుడు లింగేశ్వర్‌ మహారాష్ట్రలోని బోరి గ్రామానికి చెందిన మెస్రం రాము, దాడంజే అమర్, కుమ్రె సాహిర్‌తో మాట్లాడారు. గోవర్ధన్‌ను హత్య చేయడానికి వారితో రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. లింగేశ్వర్‌ వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకొని, అడ్వాన్స్‌ కింద రూ.10వేలు ఇచ్చాడు. కారులో వెళ్లి అదే రోజు రాత్రి సినిమా చూశారు. అనంతరం 26న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో గోవర్ధన్‌ నిద్రిస్తున్న సమయంలో మెస్రం రాము, దడేంజ అమర్‌ ఇంట్లోకి వెళ్లి క్లచ్‌ వైర్‌ మెడకు వేసి నోటి నుంచి శబ్ధం రాకుండా గొంతు నొక్కి చంపారు. భార్య రాధాబాయి గోవర్ధన్‌ మృతిపై తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దత్తత కుమారుడు నితిన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు తెలిశాయని డీఎస్పీ వివరించారు. ఈ మేరకు గేడం నితిన్, మడావి లింగేశ్వర్, మెస్రం రాము, కెమ్రె సాహిర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగతా ఇద్దరు దడంజే అమర్, కారుడ్రైవర్‌ గేడం పింటు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి నుంచి కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top