ఏసీబీ వలలో వీఆర్వో | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్వో

Published Tue, Feb 19 2019 7:43 AM

ACB Catches VRO While Demanding Bribery - Sakshi

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: డిజిటల్‌ ఈ పాస్‌బుక్‌ కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఒక రైతును డిమాండ్‌ చేసిన వీఆర్వో సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మండలంలోని సీహెచ్‌ పోతేపల్లికి ఇన్చార్జి వీఆర్వోగా పని చేస్తున్న పి.సుబ్రహ్మణ్యం రైతు కుమారుడు రాయపాటి లీలాకృష్ణమూర్తి నుంచి రూ. 4 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నిన వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ సమాచారం ప్రకారం  దొరసానిపాడుకు చెందిన రైతు రాయపాటి నాగేశ్వరరావుకు  సీహెచ్‌ పోతేపల్లిలో 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.   ఆ భూమికి ప్రస్తుతం మేన్యువల్‌ పాస్‌బుక్‌ ఉండగా, దాన్ని డిజిటల్‌ ఈ పాస్‌బుక్‌గా మార్చమని కొద్ది నెలల క్రితం రైతు రాయపాటి  కుమారుడు లీలాకృష్ణమూర్తి మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.  కనీసం దాన్ని పరిశీలించకుండా వీఆర్వో తిరస్కరించాడు.

ఈ క్రమంలో ఈ నెల 11న మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తరువాత వీఆర్వోను కలసి, తమకు ఈ పాస్‌బుక్‌ ఇప్పించాలని కోరాడు. ఇలా ఎన్నిసార్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసినా ఈ పాస్‌బుక్‌లు రావని, ఇక్కడొక రేటుంటుందని, అది చెల్లిస్తేనే పనులవుతాయని వీఆర్వో చెప్పాడు. ఈ క్రమంలోనే రూ. 4 వేలను ఇస్తే డిజిటల్‌ ఈ పాస్‌బుక్‌ వస్తుందంటూ  తెలిపాడు. దీంతో లీలాకృష్ణమూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ పథకం ప్రకారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని కంప్యూటర్‌ గదిలో లీలాకృష్ణమూర్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో సుబ్రహ్మణ్యంను రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దారు ఎం.కృష్ణమూర్తికి సమాచారాన్ని అందించారు. దీనిపై కేసు నమోదు చేశామని, వీఆర్వోను ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సిఐ కె.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు
కోడిగూడెం వీఆర్వో సుబ్రహ్మణ్యం సీహెచ్‌ పోతేపల్లి ఇన్చార్జి వీఆర్వో సుబ్రçహ్మణ్యం మీసేవా ద్వారా తాను పెట్టుకున్న దరఖాస్తును కనీసం పరిశీలించలేదని ఫిర్యాది లీలాకృష్ణమూర్తి వాపోయారు. రెండోసారి మళ్లీ దరఖాస్తు చేసి ఆయన్ను సంప్రదించానన్నారు. డబ్బుల కోసం గట్టిగా డిమాండ్‌ చేశారన్నారు. లంచం ఇవ్వకుంటే ఇక్కడ పని జరగదని తెగేసి చెప్పాడన్నారు. ఎంతో మంది చిన్న చిన్న రైతులు ఇలాంటి అధికారుల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారు ఎవరికి చెప్పుకోలేక పోతున్నారు. అందుకే తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

Advertisement
Advertisement