పోచంపల్లిలో 15మందికి అస్వస్థత

15members Illness With Alcohol Adulteration - Sakshi

కల్తీ కల్లు తాగడంవల్లేనని అనుమానం

బాధితులకు తీవ్ర వాంతులు. విరేచనాలు

పలువురి పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

గుర్రంపోడు (నాగార్జునసాగర్‌) : మండలంలోని పోచంపల్లిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కల్తీ కల్లు తాగడవల్లే.. తీవ్ర వాంతులు, విరేచనాల బారిన పడ్డారని వైద్యాధికారులు అంటున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు కుంభం యాదయ్య వద్ద రోజూ మాదిరిగానే సాయంత్రం కల్లు సేవించారు. రాత్రి పదిగంటల సమయంలో కొందరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు చికిత్స పొందారు. ఆర్‌ఎంపీ వద్దకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో కల్లు తాగడం వల్లే అని గుర్తించారు. వారిని తెల్లవారుజామున మండలకేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 108లో నల్లగొండకు తరలించారు. బాధితుల్లో గ్రామానికి చెందిన గుండెబోయిన జ్యోతి, గుండెబోయిన యాదమ్మ, గుండెబోయిన దనమ్మ, గుండెబోయిన పాపయ్య, జాల మల్లయ్య, పూలె లక్ష్మమ్మ, గుండెబోయిన సత్యనారాయణ, గుండెబోయిన కోటేష్, పూల ఇద్దయ్య, ముక్కాముల యాదమ్మ, గుండెబోయిన బక్కమ్మ, గుండెబోయిన భిక్షమయ్య, పోలేని ఏశమ్మ, ముక్కాముల లక్ష్మీప్రసన్న ఉన్నారు. వీరిలో జాల మల్లయ్య, గుండెబోయిన సత్యనారాయణచ పూలె లక్ష్మమ్మ, గుండెబోయిన భిక్షమయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

కల్తీ కల్లు కారణమా..!
కల్లు తాగిన వారందరూ అస్వస్థతకు గురికావడంతో.. కల్లు కల్తీ కావడం వల్లే జరిగిందని పోలీసు, ఎక్సైజ్‌ అధి కారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కల్లు శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌కు పంపామని, మూడు రోజుల్లో ఖచ్చి తమైన రిపోర్టు వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

బాధితులను పరామర్శించిన కలెక్టర్‌
నల్లగొండ టౌన్‌ : గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో శనివారం రాత్రి కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆదివారం కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాధితుల్లో ఐదుగురిని డిశ్చార్జ్‌ చేశారని తెలిపారు. ఎక్సైజ్‌ అధికా రులు విచారణ చేస్తున్నారని, కల్లు పరీరక్షకు పంపినట్లు, కల్తీకల్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రజలు కల్తీకల్లు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.

కల్లులో పురుగు మందుల అవశేషాలు : ఎస్పీ
నల్లగొండ క్రైం : గుర్రంపోడు మండలంలోని పోచంపల్లిలో కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలో కల్లులో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారని ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గీత కార్మికుడితో విబేధాలు ఉన్న వ్యక్తులు కల్లులో పురుగుమందు కలిపినట్లు తెలిసిందని, సంఘటనా స్థలంలో విషకారక ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన 15 మందిలో నలుగురిని మెరుగైన చికిత్స కోసం ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించామని, ఎవరికీ ఎలాంటి హానీ లేదని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

నిషా కోసమే కల్లు కల్తీ..!
గుర్రంపోడు : నిషా కోసమే కల్లును కల్తీ చేస్తారు. ఈ కల్లు సేవించిన వారి ప్రాణాల మీదకు తెస్తుంది. కొందరు నిషేధితమైన  తీపిదనాన్ని కల్గించేందుకు చక్రిన్, నిషాకు ప్రమాదకరమైన డైజోఫామ్, ఆల్ఫాజోలమ్‌ వంటి రసాయనాలు వాడుతారు. వీటితో కల్లును కల్తీ చేయడం నేరం. ఎక్సైజ్‌ అధికారుల వద్ద గల కిట్‌ ద్వారా తరుచూ కల్లు శాంపిల్స్‌ను తనిఖీలు చేయాల్సి ఉంది. కల్లు కల్తీకి వాడే రసాయనాలు అమ్మే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తారు. ఈ రసాయనాలు ఒక్కోసారి కల్లు అమ్మేవారు మోతాదుకు మించి వేయడం.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ కల్తీ కల్లు ఎక్కువగా వాసన ఉంటుంది. కల్తీ కల్లు శాంపిల్‌ను వేడిచేస్తే పసుపు రంగులోకి మారుతుంది. పో చంపల్లిలో కల్లు కల్తీ ఘటనలో కల్లు విక్రయిం చిన కుంభం యాదయ్యను పోలీసులు విచారించగా రసాయనాలు అమ్మిన గ్రామంలోని వ్యాపారితోపాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమచారం. 

జానా పరామర్శ..
నల్లగొండ టౌన్‌ :గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌తో కలిసి సీఎల్సీ నేత కుందూరు జానారెడ్డి పరామర్శించారు. అనంతరం జానా మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైన వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్లకు సూచించారు. కల్తీకల్లుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top