నిధుల వేటలో సక్సె(య)స్‌! | Sakshi
Sakshi News home page

నిధుల వేటలో సక్సె(య)స్‌!

Published Fri, Nov 1 2019 12:19 AM

YES Bank gets binding offer for 1.2 billion investment - Sakshi

న్యూఢిల్లీ: నిధుల కొరత, మొండిపద్దులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌కు భారీ ఊరట లభించింది. 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఓ ఇన్వెస్టర్‌ ముందుకొచ్చారు. కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకి ప్రతిగా ఈ మేరకు ఇన్వెస్ట్‌ చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్‌ నుంచి ఆఫర్‌ వచ్చినట్లు యస్‌ బ్యాంక్‌ గురువారం వెల్లడించింది. బ్యాంకు బోర్డు, నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులకు లోబడి తాజా పెట్టుబడులు ఉంటాయని తెలిపింది.

‘మరిన్ని పెట్టుబడుల కోసం ఇతర దేశ, విదేశ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు కొనసాగుతాయి‘ అంటూ బ్యాంకు వివరించింది. వ్యాపార వృద్ధికి దోహదపడేలా మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తున్నామని, పలు విదేశీ సంస్థలతో పాటు దేశీయంగా ప్రైవేట్‌ ఈక్విటీ, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు తమ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని యస్‌ బ్యాంకు గత నెలలో స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఆగస్టులో యస్‌ బ్యాంక్‌ రూ. 1,930 కోట్లు సమీకరించింది.

నియంత్రణ సంస్థ ఏం చేస్తుందో..
పెట్టుబడుల వార్త వెల్లడి కావడానికి ముందు యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ సుమారు 2 బిలియన్‌ డాలర్ల వద్ద తిరుగాడింది. ఆ ప్రకారం చూస్తే 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి చాలా భారీ మొత్తమే కానుంది. సంస్థ భవిష్యత్‌ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకమున్నందుకే ఇన్వెస్టర్లు కాస్త ఎక్కువ రేటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రూ. 100 వద్ద షేరు కేటాయించిన పక్షంలో విదేశీ ఇన్వెస్టరుకు 25 శాతం వాటా లభించవచ్చు. అంతకు మించి 26 శాతం వాటా తీసుకున్న పక్షంలో మైనారిటీ షేర్‌హోల్డర్లకు ఓపెన్‌ ఆఫరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మొత్తం వ్యవహారం జటిలంగా మారే అవకాశం ఉంది.

మరోవైపు, ఈ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో ఏ ఒక్క ఇన్వెస్టరుకు 10 శాతానికి మించి వాటాలు తీసుకోవడానికి లేదు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సడలించే అంశాన్ని పరిశీలించవచ్చని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం యస్‌ బ్యాంకు దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంకులో ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ కూడా ఇదే తరహాలో మెజారిటీ వాటాలు తీసుకునేందుకు అంగీకరించినందున.. తాజాగా అదే తరహా యస్‌ బ్యాంకు డీల్‌ విషయంలో ఆర్‌బీఐ కాదనకపోవచ్చని అంచనాలు ఉన్నాయి.

24 శాతం ఎగిసిన షేరు..
విదేశీ ఇన్వెస్టరు పెట్టుబడుల వార్తలతో గురువారం యస్‌ బ్యాంక్‌ షేరు భారీగా ఎగిసింది. బీఎస్‌ఈలో ఒక దశలో ఏకంగా  35% పెరిగి రూ.76.65 స్థాయిని  తాకింది. చివరికి 24% పెరిగి రూ. 70.45 వద్ద క్లోజైంది. ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో 39% (రూ.78.70కి) ఎగిసిన షేరు ఆ తర్వాత సుమారు 24 శాతం లాభంతో రూ.70.30 వద్ద ముగిసింది. యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 3,500 కోట్లు ఎగిసి రూ.17,967 కోట్లకు చేరింది.

Advertisement
Advertisement