టోకు ధరలూ  దిగి వచ్చాయ్‌!

 WPI cools to 10-month low of 2.76% in Jan on cheaper fuel - Sakshi

జనవరిలో ధరల స్పీడ్‌ 2.76 శాతం

10 నెలల కనిష్ట స్థాయి ఇది...

న్యూఢిల్లీ: రిటైల్‌ ధరల తరహాలోనే టోకు ధరల స్పీడ్‌ కూడా జనవరిలో తగ్గింది. గురువారం కేంద్రం విడుదల చేసిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.76 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (ఆ నెల్లో 3.02 శాతం) పోలిస్తే టోకు వస్తువుల బాస్కెట్‌ ధర 2019 జనవరిలో కేవలం 2.76 శాతమే పెరిగింది. పది నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన గణాంకాల ప్రకారం, జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయిని నమోదుచేసి, కేవలం 2.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజా గణాంకాలను విశ్లేషిస్తే ఆహారం, ఇంధనం, విద్యుత్‌ రంగాల్లో ధరల స్పీడ్‌ తగ్గడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ముఖ్యాంశాలు చూస్తే... 

∙ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్, నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.96 శాతం (2018 జనవరి) నుంచి 2.61 శాతానికి తగ్గింది. ఫుడ్‌ ఆర్టికల్స్‌లో రేటు 4.73 శాతం నుంచి 1.85 శాతానికి తగ్గింది. నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌లో మాత్రం జనవరి 2019లో ధరల పెరుగుదల రేటు 4.06 శాతంగా ఉంది. 2018 జనవరిలో – 1.31 శాతంగా ఉంది. కాగా డిసెంబర్‌లో టోకు ఫుడ్‌ ఇన్‌ఫ్లేషన్‌ 
8.38 శాతంగా ఉంది.  

∙ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌: ఈ రంగంలో రేటు 3.15 శాతం నుంచి 2.34 శాతానికి తగ్గింది. 
∙తయారీ: సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న ఈ విభాగంలో మాత్రం ద్రవ్యోల్బణం 2.53 శాతం నుంచి 3.54 శాతానికి పెరిగింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top