డేటా సెంటర్‌ బిజినెస్‌కు విప్రో స్వస్తి!

Wipro completes sale of hosted datacenter business to Ensono - Sakshi

ఉద్యోగులు, సెంటర్లు ఎన్సొనోకు అప్పగింత

న్యూఢిల్లీ: దేశీ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘విప్రో’... తాజాగా 399 మిలియన్‌ డాలర్లకు తన హోస్టెడ్‌ డేటా సెంటర్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ను విక్రయించటం పూర్తయిందని తెలియజేసింది. కంపెనీ ఇందులో భాగంగా విప్రో డేటా సెంటర్‌ అండ్‌ క్లౌడ్‌ సర్వీసెస్‌ (అమెరికా) సహా జర్మనీ, యూకేలలో డేటా సెంటర్‌ బిజినెస్‌ను, భారత్‌లో కొంత మంది ఉద్యోగులను హైబ్రిడ్‌ ఐటీ సేవల సంస్థ ‘ఎన్సొనొ’కు అప్పగించింది. ఎనిమిది డేటా సెంటర్లను, దాదాపు 900 మంది ఉద్యోగులను ఎన్సొనొకి బదిలీ చేస్తామని విప్రో మార్చిలోనే ప్రకటించింది.

ప్రస్తుత త్రైమాసికపు ఆర్థిక ఫలితాలపై డేటా సెంటర్‌ బిజినెస్‌ విక్రయ ప్రభావం ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత్‌లో డేటా సెంటర్‌ కార్యకలాపాల ముగింపు సెప్టెంబర్‌ త్రైమాసికంలో పూర్తికావొచ్చని అంచనా వేసింది. దీని తర్వాత ఎన్సొనొ నుంచి మరో 6 మిలియన్‌ డాలర్లు అందుతాయి. మరోవైపు ఎన్సొనొ హోల్డింగ్స్‌లో విప్రో ఎల్‌ఎల్‌సీ 10.2 శాతం వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపింది.

ఈ డీల్‌లో భాగంగా విప్రో.. ఎన్సొనో సంస్థలో 55 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇక 2007 ఇన్ఫోక్రాసింగ్‌ కొనుగోలుతో విప్రో.. డేటా సెంటర్‌ సర్వీసెస్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీలు వాటి డేటాను భద్రపరచుకునే ప్రాంతమే డేటా సెంటర్‌. ఇక హోస్టింగ్‌ డేటా సెంటర్‌ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీలు మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి, దాన్ని కొన్ని భాగాలుగా చేసి ఇతర కంపెనీలకు ఆఫర్‌ చేస్తాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top