ఐఫోన్ల కోసం అంత క్యూలు ఎందుకు?

Why do people queue up for hours at Apple stores - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్‌ కంపెనీ ప్రత్యేక ఎడిషన్‌ ‘ఆపిల్‌ ఎక్స్‌’ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు కూడా ఎప్పటిలాగే వినియోగదారులు ఒక రోజు ముందు నుంచే కంపెనీ షోరూమ్‌ల ముందు క్యూలో నిలుచున్నారు. పడిగాపులు గాశారు. ఆపిల్‌ కంపెనీ నుంచి ఏ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడల్లా వినియోగదారులు ఒకటి, రెండు రోజుల ముందు నుంచే షాపుల ముందు క్యూలు కడుతున్నారు. గత పదేళ్లుగా ఇదే జరుగుతోంది.

ఎందుకు వినియోగదారులు ఇలా క్యూలో నిలబడుతున్నారు. చాలా మందికన్నా ముందుగానే తాము కొత్త ఫోన్‌ను అందుకోవలనా? పరిమితంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఆలస్యంగా వెళితే దొరకవనే ఉద్దేశమా? ఆపిల్‌ ఉత్పత్తులపైన ఉన్న క్రేజీనా? వినియోగదారుల్లో పెరిగిన కన్జూమరిజమా?, మూర్ఖత్వమా?  ఆన్‌లైన్‌లో కూడా అమ్మకాలున్నప్పుడు షాపుల ముందే ఎందుకు పడిగాపులు పడాలి? ఇలా క్యూలో నిలబడడాన్ని శ్యామ్‌సంగ్‌ లాంటి పోటీ మొబైల్‌ ఫోన్‌ సంస్థలు యాడ్స్‌ రూపంలో అపహాస్యం చేస్తున్నా వినియోగదారులు క్యూలో నిలబడేందుకు ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఇలా క్యూలో నిలబడ్డవారినే ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలు చేయగా చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

మొట్టమొదటి ప్రధాన కారణం మీడియానేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్యూలకు ఎక్కువ ప్రాధాన్యతను మొదటి నుంచి ఇస్తున్నది మీడియానే. మీడియాలో తాము కనిపిస్తామన్న ఉద్దేశంతో కొంత మంది వినియోగదారులు క్యూ కడుతుండగా, ఎక్కువ మంది తాము నిలబడ్డ చోటును అమ్ముకుంటున్నారు. ఈ చోటు విలువ అంతా, ఇంతా కూడా కాదు. మూడు వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటోంది. క్యూలో ముందున్న వ్యక్తి తన చోటును 30వేల రూపాయలకు విక్రయిస్తుండగా, పదవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎనిమిది నుంచి 15 వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. కొందరు తమ యాప్స్‌ పబ్లిసిటీ కోసం క్యూలను ఉపయోగించుకుంటున్నారు. తమ యాడ్‌ కలిగిన టీషర్టులు ధరించి క్యూలో నిలబడిన వారికి, వారి వారి డిమాండ్ల మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు.

కొన్ని యాప్స్‌ సంస్థలు తమ వాలంటీర్లనే డబ్బులిచ్చి నిలబెడుతున్నాయి. ఇటీవల ఐఫోన్‌ ఆపిల్‌ ఎక్స్‌ విడుదల సందర్భంగా సిడ్నీలో క్యూలో ముందు నిలబడిన వ్యక్తి ‘యూట్యూబర్‌’. ఫోన్‌ విడుదలపై యూట్యూబ్‌ డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. అందులో ప్రధానంగా కనిపించడం కోసం మొదటి స్థానంలో నిలబడ్డారు. ఇక రెండు, మూడోస్థానంలో నిలబడ్డవారు ‘డెయిలీ మిర్రర్‌’ వెబ్‌సైట్‌కు లైవ్‌ బ్లాగ్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ విషయంలో ఫుడ్‌ కంపెనీలు కూడా ఏమీ తీసిపోలేదు. తమ ఉత్పత్తులను పబ్లిసిటీ కోసం క్యూలో నిలుచున్న వారికి ఉచితంగా అందజేస్తున్నాయి. గ్రెగ్స్, డామినోస్, నండోస్, సబ్‌వే కంపెనీలు ఈ విషయంలో పోటీ పడ్డాయి. తమ ఉత్పత్తులను వినియోగదారులు తింటుంటే మీడియాలో వాటి బ్రాండ్ల పేర్లు కనిపిస్తాయన్నది ఆహార కంపెనీల ఆశ. చారిటీ సంస్థల ప్రతినిధులు కూడా నిధుల కోసం క్యూలో నిలబడుతుండడం విశేషం. ఇలా ఆపిల్‌ క్యూల వెనక ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అందరికన్నా ఎక్కువ ప్రయోజనం మాత్రం ఆపిల్‌ కంపెనీకే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top