ప్రపంచ బ్యాంకు సారథిగా ఇంద్రా నూయి?

White House Considering Indra Nooyi to Head World Bank - Sakshi

ఆమె పేరును ప్రతిపాదించిన ట్రంప్‌ కుమార్తె ఇవాంకా

న్యూయార్క్‌: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ పదవి రేసులో పెప్సీకో మాజీ సీఈవో, జన్మతః భారతీయురాలైన ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమార్తె ఇవాంక, ఇంద్రా నూయి పేరును ప్రతిపాదించారు. ఇంద్రా నూయిని మార్గదర్శిగా, స్ఫూర్తినీయురాలిగా పేర్కొంటూ ఇవాంకా గత ఆగస్ట్‌లో ఓ ట్వీట్‌ కూడా చేశారు.

అయితే, తన నామినేషన్‌ను ఇంద్రా నూయి అంగీకరిస్తారా, లేదా అన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్‌ జిమ్‌యాంగ్‌ కిమ్‌ ఫిబ్రవరిలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. నిర్ణీత పదవీ కాలం కంటే మూడేళ్ల ముందే ఆయన తప్పుకుంటున్నారు. కిమ్‌ వారసుల ఎంపిక ప్రక్రియను ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ ముంచిన్, ఇవాంకా చూస్తున్నారు. ఈ కమిటీ అభ్యర్థుల నామినేషన్లతో కూడిన జాబితాను ట్రంప్‌ ముందు ఉంచనున్నారు. ఇవాంక మద్దతుతో నూయి ప్రధాన పోటీదారుగా మారడం ఆసక్తికరం.  

రేసులో మరో ఇద్దరు...
ఇక ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ పదవికి....అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి  డేవిడ్‌ మల్‌పాస్, ఓవర్సీస్‌ ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ రే వాష్‌బర్న్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిని ప్రపంచ బ్యాంక్‌ బోర్డ్‌ నియమిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షడు నామినేట్‌  చేసిన వ్యక్తే ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు కావడం రివాజు. వైట్‌ హౌస్‌ సీనియర్‌ సలహాదారు పదవిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కూతురిని నియమించడం పట్ల ఇప్పటికే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవి విషయంలో ఇవాంకా జోక్యం చేసుకోవడంతో ఈ విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. తన స్వప్రయోజనాల కోసం ఇవాంకా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చుతున్నారన్న విమర్శలున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top