క్యూ4లో అదరగొడతాం..

Vizag Steel CMD reveals - Sakshi

వైజాగ్‌ స్టీల్‌ సీఎండీ వెల్లడి 

న్యూఢిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌–ఆర్‌ఐఎన్‌ఎల్‌) గత ఏడాది ఏప్రిల్‌– డిసెంబర్‌ కాలానికి టర్నోవర్‌తో సహా పలు అంశాల్లో మంచి వృద్ధిని సాధించింది. ఈ కాలంలో రూ.11,405 కోట్ల టర్నోవర్‌ సాధించామని, అంతకు ముందటేడాది ఇదే కాలంలో సాధించిన టర్నోవర్‌తో పోలిస్తే ఇది 30 శాతం అధికమని ఆర్‌ఐఎన్‌ఎల్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికం) రికార్డ్‌ స్థాయి పనితీరు సాధించనున్నామని ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీ పి.మధుసూదన్‌ చెప్పారు.

16 శాతం పెరిగిన శ్రామిక ఉత్పాదకత...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో హాట్‌ మెటల్‌ ఉత్పత్తి 13 శాతం వృద్ధితో 3.65 మిలియన్‌ టన్నులకు, లిక్విడ్‌ స్టీల్‌ ఉత్పత్తి 15 శాతం వృద్ధితో 3.54 మిలియన్‌ టన్నులకు పెరిగాయని మధుసూదన్‌ తెలియజేశారు. విక్రయించదగ్గ ఉక్కు ఉత్పత్తి 15 శాతం వృద్ధితో 3.19 మిలియన్‌ టన్నులకు పెరిగిందని,  శ్రామిక ఉత్పాదకత 16 శాతం వృద్ధి చెందిందని వివరించారు. గత ఏడాదిలో  విస్తరణ, ఆధునికీకరణ పూర్తయ్యాయని, ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మిలియన్‌ టన్నులకు పెంచామని పేర్కొన్నారు. ఆదాయం మెరుగుపరచుకోవడానికి అమ్మకాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారాయన.

మరింత మార్కెట్‌ కోసం ప్రత్యేక వ్యూహాలు...: స్థూల మార్జిన్‌ను సాధించామని, గత రెండు నెలల్లో ఎలాంటి రుణాలు చేయలేదని, ఫలితంగా ఈ క్యూ4లో మంచి పనితీరు కనబరచనున్నామన్న ధీమాను మధుసూదన్‌ వ్యక్తం చేశారు. విలువ జోడించే ఉక్కు ఉత్పత్తులకు భారత్‌లో డిమాండ్‌ పెరుగుతోందని, ఉత్పత్తిలో కొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రత్యేక ఉక్కు ఉత్పత్తుల సెగ్మెంట్లో మార్కెట్‌ వాటా పెంచుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేశామని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top