కుప్పకూలిన యూఎస్‌ మార్కెట్లు

US Markets tumbles- Blue chips plunges - Sakshi

3 నెలల్లోనే అత్యధిక పతనం

డోజోన్స్‌ 1862 పాయింట్లు డౌన్‌

6 శాతం పతనమైన ఎస్‌అండ్‌పీ

528 పాయింట్లు కోల్పోయిన నాస్‌డాక్‌

10-5 శాతం మధ్య పడిపోయిన బ్లూచిప్స్‌

పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. వెరసి గురువారం యూఎస్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్‌ 1862 పాయింట్లు(7 శాతం) కుప్పకూలి 25,128 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 188 పాయింట్లు(6 శాతం) పడిపోయి 3,002 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 528 పాయింట్లు(5.3 శాతం) క్షీణించి 9,493 వద్ద స్థిరపడింది. తద్వారా మార్కెట్లు ఏప్రిల్‌ 16 తదుపరి ఒకే రోజులో అత్యధిక నష్టాలు చవిచూశాయి. కాగా.. యూరోపియన్‌ మార్కెట్లు సైతం గురువారం 4.5 శాతం స్థాయిలో పతనంకావడం గమనార్హం! 

మరోసారి లాక్‌డవున్‌
ఇప్పటికే 20 లక్షల మందికిపైగా సోకిన కరోనా వైరస్‌ మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇటీవల తలెత్తుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి లాక్‌డవున్‌ విధించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నట్లు తెలియజేశారు. దీనికితోడు అమెరికా జీడీపీ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు వివరించారు. కోవిడ్‌-19 కారణంగా సెప్టెంబర్‌కల్లా మరణాల సంఖ్య 2 లక్షలను దాటవచ్చన్న అంచనాలు సైతం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు.

బోయింగ్‌ పతనం
వైమానిక రంగ దిగ్గజం బోయింగ్‌ ఇంక్‌ షేరు దాదాపు 17 శాతం కుప్పకూలగా.. క్రూయిజర్‌, ఎయిర్‌లైన్‌ కంపెనీల కౌంటర్లలో గురువారం మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. రాయల్‌ కరిబ్బియన్‌, ఎస్‌పీ కామెయిర్‌ 14 శాతం చొప్పున పతనంకాగా.. నార్వేజియన్‌ క్రూయిజ్‌ లైన్‌ 16.5 శాతం పడిపోయింది. ఇతర బ్లూచిప్స్‌లో డోఇంక్‌, ఐబీఎం, గోల్డ్‌మన్‌ శాక్స్‌, కేటర్‌పిల్లర్‌, ఎక్సాన్‌ మొబిల్‌, జేపీ మోర్గాన్‌, సిస్కో, ఫైజర్‌, వాల్ట్‌డిస్నీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, నైక్‌, ఇంటెల్‌, కోక కోలా, మెర్క్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top