భారీ డిస్కౌంట్లకు ఇదే చివరి అవకాశం

Upcoming Diwali Sale Might Be Your Last Chance To Get Massive Discounts - Sakshi

న్యూఢిల్లీ : ఈ పండగ కాకపోతే.. వచ్చే పండగ. లేదా ఆ తర్వాత ఫెస్టివల్‌కు చూసుకోవచ్చులే. ఏదైనా కొత్త వస్తువు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చులే, డిస్కౌంట్లు ఎలాగో ప్రతి పండగకు ఉంటాయిలే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, అప్లియెన్స్‌, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశమట. వచ్చే దివాళి సేల్‌ అనంతరం, ఈ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు పొందాలంటే కాస్త కష్టతరమేనట. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ వస్తువులపై కస్టమ్‌ సుంకాన్ని పెంచింది. ఈ సుంక పెంపు నేపథ్యంలో వచ్చే పండగ సీజన్‌ తర్వాత వీటిపై ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి.

షావోమి, హానర్‌, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, ఆసుస్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ఈ పండగ సీజన్‌ వరకు ఎలాంటి ధరలు పెంచకూడదని నిర్ణయించి, ఆ తర్వాత నుంచి ధరల పెంపు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే వైట్‌ గూడ్స్‌ తయారీదారులు పానాసోనిక్‌, బోస్‌, బీఎస్‌హెచ్‌ ఎలక్ట్రానిక్స్‌ కూడా పండగ సీజన్‌ వరకు ధరలు పెంచకూడదని నిర్ణయించాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, కరెంట్‌ అకౌంట్‌ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కస్టమ్‌ డ్యూటీని పెంచింది. సరిగ్గా పండగ సీజన్‌కు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ఉండవోనని వినియోగదారులు తెగ ఆందోళన చెందారు. కానీ ఈ పండగ సీజన్‌ వరకు ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఉందని, ఈ పండగ సీజన్‌ ‌అయిపోయిన వెంటనే కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి.

‘రూపాయి క్షీణత నిజంగా పెద్ద తలనొప్పి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ ధరలు 10 శాతం వరకు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధరలు పెంచకూడదని నిర్ణయించాం. అంతేకాక సేల్స్‌ వాల్యుమ్‌ పెంచేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాం’ అని హువావే, హానర్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీ సంజీవ్‌ తెలిపారు. వెంటనే ధరల పెంపు చేపట్టి, వినియోగదారులపై భారం వేయకుండా.. ఈ ఏడాది ముగింపు నాటికి ధరలను పునఃసమీక్షిస్తామని వన్‌ప్లస్‌, షావోమి తెలిపాయి. ఈ పండగ సీజన్‌ వరకు అయితే డిస్కౌంట్లను, ఆఫర్లను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top