
టయోటా లాకౌట్ ఏకపక్షం
టయోటా లాకౌట్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కంపెనీ కార్మిక సంఘం సోమవారం కోరింద
ముంబై: టయోటా లాకౌట్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కంపెనీ కార్మిక సంఘం సోమవారం కోరింది. వేతన పెంపు విషయమై చర్చలు విఫలమవడం, తదుపరి సంఘటనల నేపథ్యంలో టయోటా కంపెనీ బెంగళూరులో సమీపంలోని బిదాడిలోని రెండు ప్లాంట్లలో టయోటా కంపెనీ లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాకౌట్ అన్యాయయని, ఏక్షపక్షమని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎంప్లాయిస్ యూనియన్ నిప్పులు చెరిగింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా లాకౌట్ ప్రకటించిందని యూనియన్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ విరుచుకుపడ్డారు.
అమ్మకాలు లేకపోవడంతో ఉత్పత్తిని, నిల్వలను తగ్గించుకోవడం కోసం కూడా కంపెనీ లాకౌట్‌ను ప్రకటించిందని కుమార్ పేర్కొన్నారు. కర్నాటక ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని కర్నాటక ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని సమర్పించామని కార్మిక సంఘ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు ప్లాంట్లలో 4,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి వేతన పెంపు రూ.4,000 కోరుతున్నామని, కానీ, యాజమాన్యం రూ.3,050 మాత్రమే పెంచుతామని అంటోందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ విమర్శలపై స్పందించడానికి యాజమాన్యం నిరాకరించింది. సంప్రదింపులు జరుగుతున్నందున ఈ విమర్శలపై వ్యాఖ్యానించబోమని పేర్కొంది.