టర్మ్‌ పాలసీకి.. క్లిక్‌ చేయండి!

టర్మ్‌ పాలసీకి.. క్లిక్‌ చేయండి!


జీఎస్‌టీతో మరింత పెరిగిన టర్మ్‌ పాలసీ రేట్లు

ఇప్పటిదాకా పన్ను 15 శాతం... ఇపుడు 18%

కొంతైనా ఉపశమనం కావాలంటే ఆన్‌లైనే మార్గం

ఆఫ్‌లైన్‌తో పోలిస్తే 40–50 శాతం ధరలు చౌక

డాక్యుమెంట్లను కూడా ఆన్‌లైన్లోనే అందించొచ్చు

అన్ని వివరాలూ చెబితే తక్షణం కవరేజీ మొదలు  




ఉద్యోగులైనా, వ్యాపారులైనా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండి తీరాల్సింది టర్మ్‌ పాలసీ. కాకపోతే వీటిపై ఇపుడు జీఎస్‌టీ భారం అధికమైంది. గతంలో టర్మ్‌ పాలసీల ప్రీమియంపై 15 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ విధించేవారు. జీఎస్‌టీ అమలుతో ఇది 18 శాతానికి పెరిగింది. దీంతో టర్మ్‌ పాలసీలు కాస్త ఖరీదయ్యాయి. అయితే, ఇప్పటికే పాలసీలు తీసుకున్నవారిని మినహాయిస్తే... కొత్తగా పాలసీలు తీసుకునే వారు ఈ భారాన్ని తగ్గించుకోవటానికి ఓ మార్గముంది. అది... ఆన్‌లైన్‌ను ఆశ్రయించటం. టర్మ్‌ పాలసీని ఏజెంట్‌ దగ్గరో లేక బీమా కార్యాలయానికి వెళ్లో తీసుకునే బదులు నేరుగా బీమా కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి తీసుకుంటే మరింత పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.



ఆఫ్‌లైన్‌లో తీసుకునే టర్మ్‌ పాలసీల ప్రీమియంతో పోలిస్తే ఆన్‌లైన్‌ వేదికగా కస్టమర్‌ నేరుగా తీసుకునే పాలసీ ప్రీమియం కనీసం 30 నుంచి 40 శాతం మేర తక్కువగా ఉంటుంది. జీఎస్టీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి లేదు. ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ తీసుకుంటే ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్‌ లేదా మరో బీమా బ్రోకర్‌ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్‌ చెల్లించాల్సి ఉంటుంది.



 ఆన్‌లైన్‌లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే వారిలో అత్యధిక మంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో కంపెనీలు తక్కువ ప్రీమియం రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇక పరిపాలనా వ్యవహారాల వ్యయమూ కలుపుకుంటే కంపెనీలకు ఆ మేరకు భారం తగ్గినట్టే కదా!! అందుకే అవి ఆన్‌లైన్‌ పాలసీల ప్రీమియంలను ఆ మేరకు తగ్గిస్తున్నాయి.



ఉదాహరణకు సిగరెట్, పొగాకు అలవాటు లేని 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడు కోటి రూపాయలకు ఆఫ్‌లైన్‌ టర్మ్‌ పాలసీ కావాలనుకుంటే ఎల్‌ఐసీ అమూల్య జీవన్‌2 పాలసీలో జీఎస్‌టీ కూడా కలిపి ప్రీమియం రూ.39,648గా ఉంది. ఇంతే మొత్తానికి ఎల్‌ఐసీ నుంచే ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ తీసుకుంటే ప్రీమియం కేవలం రూ.23,340 చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదికి రూ.16,308 మేర మిగులుతుంది. ఇది భారీ వ్యత్యాసంగా చెప్పుకోవాలి. జీవిత బీమా విషయంలో సంప్రదాయ పాలసీలతో పోలిస్తే టర్మ్‌ పాలసీలు చాలా చౌక. అందులోనూ ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ మరింత చౌక. మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి చూసుకున్నా ఆఫ్‌లైన్‌ పాలసీ అయిన సూపర్‌ టర్మ్‌ ప్లాన్‌లో పైన చెప్పుకున్న వ్యక్తికే కోటి రూపాయల బీమాతో పాలసీ కావాలనుకుంటే ప్రీమియం రూ.19,470. మ్యాక్స్‌ లైఫ్‌ ఆన్‌లైన్‌ టర్మ్‌ ప్లాన్‌ ప్లస్‌లో ప్రీమియం రూ.11,564 మాత్రమే.



ఏజెంట్‌ లేకపోయినా సేవలు అలాగే...

ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభి స్తాయన్న అపోహ ఉంది. కానీ ఏజెంట్‌ ఉన్నా లేకపోయినా కంపె నీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయిమ్‌లు కూడా ఆన్‌లైన్‌ ద్వా రానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్‌డీఏకి ఫిర్యాదు చేయొచ్చు.



తక్షణం బీమా మొదలు

ఆన్‌లైన్‌ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిస్తుంది.



రెన్యువల్‌ మర్చిపోవద్దు...

ఆన్‌లైన్‌ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభం. అయితే ఏటా దాన్ని రెన్యువల్‌ చేయటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్‌ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లెవరూ ఉండరు. రెన్యువల్‌ చేసుకోకపోతే... కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అపుడు వయసు పెరుగుతుంది కనక ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్‌లైన్‌ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్‌ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ గ్రేస్‌ పీరియడ్‌ కోసం ఆగకుండా కాల పరిమితిలోగానే రెన్యువల్‌ చేసుకుంటే బాగుంటుంది.



ఆరోగ్య విషయాలు దాచొద్దు..

ధూమపానం, గుట్కా వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25–35% అధికంగా ఉం టాయి. ప్రీమియం పెరుగుతుం దని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్‌ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆరోగ్యం, ఆహా ర అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్నివ్వండి.



తీసుకోవటం ఇలా..

ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ అందిస్తోంది. ప్రీమియం రేట్లను పోల్చి చూడటానికి పాలసీ బజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి పలు వెబ్‌సైట్లున్నాయి. చెక్‌ చేసుకున్నాక నేరుగా సదరు బీమా కంపెనీ వెబ్‌సైట్లోకి లాగిన్‌ కావాలి. అక్కడే టర్మ్‌ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా.



Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top