కూరగాయల ధరల మంట!

As temperature soars, so do vegetable rates - Sakshi

ఏప్రిల్‌లో  ఏకంగా 40.65 శాతం పెరిగిన టోకు ధరలు

మొత్తం ద్రవ్యోల్బణం 3.07%

2018 ఏప్రిల్‌లో 3.62 శాతం

న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టోకున కూరగాయల బాస్కెట్‌ ధరలు ఏప్రిల్‌లో 40.65 శాతం (2018 ఏప్రిల్‌ ధరలతో పోల్చితే) పెరిగాయి. అయితే మొత్తంగా  టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలోని అన్ని విభాగాలనూ కలిపి చూస్తే,  ఏప్రిల్‌లో 3.07 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్‌ ధర టోకును 2018 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2019 ఏప్రిల్‌లో 3.07 శాతం పెరిగిందన్నమాట. అయితే 2018 ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు (2017 ఏప్రిల్‌తో పోల్చితే) 3.62 శాతంగా ఉంది. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉండే తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇంధనం ధర కూడా ఏప్రిల్‌లో పెద్దగా పెరగలేదు.  సూచీలో ఫుడ్‌ ఆర్టికల్స్‌ వాటా దాదాపు 20 శాతం. ఒకవైపు ద్రవ్యోల్బణం రేట్లు అదుపులో ఉండడం, మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత నేపథ్యంలో జూన్‌లో ఆర్‌బీఐ రెపో రేటు కోత మరోసారి ఉండవచ్చని అసోచామ్‌సహా పలు పారిశ్రామిక సంఘాలు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ పరిశోధనా నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్‌ టోకు
ధరల పరిస్థితిపై  మంగళవారం విడుదలైన  గణాంకాలను చూస్తే... 

►నెలల వారీగా, 2019 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 2.93% ఉంటే... మార్చిలో 3.18%.  
►   ఇక సూచీలోని ఆహార విభాగాన్ని చూస్తే, ధరల స్పీడ్‌ ఏప్రిల్‌లో ఏకంగా 7.37 శాతంగా ఉంది. అంతక్రితం నెల అంటే మార్చిలో ఈ స్పీడ్‌ కేవలం 5.68 శాతమే. ఈ విభాగంలో ఒకటైన  కూరగాయల ధరల పెరుగుదల దీనికి కారణం. 2018 డిసెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.42 శాతం క్షీణించింది. అయితే అప్పటినుంచీ పెరుగుతూ వస్తోంది. ఇదే కూరగాయల రేట్లను చూస్తే,  2018 డిసెంబర్‌లో –19.29 శాతం క్షీణత ఉంటే, 2019 మార్చిలో 28.13 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో ఏకంగా 40.65% పెరిగింది. కాగా ఆలూ ధరల మాత్రం పెరగలేదు. 17.15 శాతం తగ్గాయి. 

రేటు కోత సంకేతాలు... 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను మరింత తగ్గించడానికి అనుగుణమైన గణాంకాలు ప్రస్తుతం వస్తున్నాయని పారిశ్రామిక రంగం పేర్కొంటోంది. జూన్‌ 6న ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమీక్ష ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాలసీ రేటు నిర్ణయానికి ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. బుధవారం నాడు విడుదలైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.92%గా నమోదైంది. ఇది ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యం 4% లోపే ఉండడం గమనార్హం. ఇక మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారింది.  మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్‌బీఐ మరోదఫా రేటు రెపో రేటు తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణం  4% దిగువనే ఉన్నందున వచ్చే నెల   పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గింపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అసోచామ్‌ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సుభాశ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top