సోనీ నుంచి తెలుగు టీవీ చానల్!

సోనీ నుంచి తెలుగు టీవీ చానల్!


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోకి ప్రముఖ సంస్థ సోనీ ప్రవేశించే యత్నాల్లో ఉంది. సోనీ చానళ్లను నిర్వహిస్తున్న మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్‌ఎం) 2012 ఏప్రిల్‌లో ఒక ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో 30 శాతం వాటా తీసుకోవాలని యత్నించింది. అయితే ఆ డీల్ కార్యరూపం దాల్చలేదు.తెలుగు టెలివిజన్ రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా వినోద చానల్‌ను పరిచయం చేయాలన్న ఆలోచన సంస్థ ముందు ఉందని మల్టీ స్క్రీన్ మీడియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ సౌరభ్ యాగ్నిక్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో సానియా మీర్జాతో కలసి పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. తెలుగు చానల్ విషయాన్ని బోర్డు చర్చిస్తోందని చెప్పారు. సినిమా, టీవీ రంగంపై ఆయనింకా ఏమన్నారంటే..

 టాప్ 10 దేశాల్లో భారత్..

 హాలీవుడ్‌కు వస్తున్న ఆదాయాల్లో 60-70 శాతం అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా సమకూరుతోంది. భారత్‌తోపాటు జపాన్, చైనా, ఆస్ట్రేలియా, యూరప్, రష్యా దేశాల్లో ఇంగ్లిష్ సినిమాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో 20 శాతం టీవీ గృహాలు ప్రీమియం ఇంగ్లిష్ చానళ్లకు చందాదారులుగా ఉన్నాయి. చందాదారుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది.ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య పెరగడం కూడా సినిమాలకు డిమాండ్ తెచ్చిపెడుతోంది. మన దేశంలో స్పైడర్ మ్యాన్, స్కైఫాల్, అవతార్, అవెంజర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక్కొక్కటి రూ.100 కోట్లకు చేరువగా రెవెన్యూ నమోదు చేశాయి. టీవీల ప్రకటనల ఆదాయమూ 15-20 శాతం వృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్ రాకతో..

 భారత్‌లో ఏటా 2,500 దాకా ఇంగ్లిష్ సినిమాలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. కేవలం టీవీల్లోనే ప్రసారమయ్యే సినిమాలు 400 దాకా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా విడుదలైన వారం రోజుల్లోనే  భారత్‌లోనూ సినిమాలు ఆడుతున్నాయి. హాలీవుడ్ పంపిణీ సంస్థలు నేరుగా భారత్‌తో కార్యకలాపాలను సాగిస్తున్నాయంటే ఇక్కడున్న అవకాశాలను అంచనా వేయొచ్చు.ఇక ప్రతి వారం ఏడు కోట్ల మంది భారతీయులు టీవీల్లో ఇంగ్లిష్ సినిమాలను వీక్షిస్తున్నారని అంచనా. వీరిలో దక్షిణాదివారు 2 కోట్లు ఉంటారు. వీక్షకుల్లో అత్యధికులు 15 నుంచి 34 ఏళ్లలోపువారే. టీవీల ముందు ఒక్కో వ్యక్తి గడుపుతున్న సమయం సరాసరి 25-30 నిమిషాలుంటోంది. సినిమా నేపథ్యం, నటీనటులు, ఎప్పుడు, ఎక్కడ విడుదలయ్యేది ఇంటర్నెట్‌లో చూస్తున్నారు. ఇంతటి ప్రయోజనంతోపాటు ఇంటర్నెట్‌తో పైరసీ ప్రమాదమూ పొంచి ఉంది. కొత్తదనం అందిస్తాం..

 వీక్షకులకు కొత్తదనం అందించడంలో ముందున్నాం. ఏటా 400 సినిమాల వరకు లైబ్రరీలో నిక్షిప్తం చేస్తున్నాం. వీటిలో కొత్త సినిమాలు 40 ఉంటున్నాయి. పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ పేరుతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. యువతుల మనసును జేమ్స్‌బాండ్ మాదిరిగా ఎలా దోచుకోవాలో యువకులకు సానియా వివరిస్తుంది. 2 నిమిషాల నిడివిగల క్లిప్పింగ్స్‌ను జేమ్స్‌బాండ్ సినిమా ప్రసారం సమయంలో ప్రదర్శిస్తాం. జేమ్స్‌బాండ్ సినిమాలంటే విశ్వవ్యాప్తంగా యమా క్రేజ్. అన్ని దేశాల్లో కలిపి రూ.24,000 కోట్ల రూపాయల రెవెన్యూను ఈ సినిమాలు కైవసం చేసుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top