ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు

Telcos Have Sufficient Capacity to Pay Dues After SC Verdict - Sakshi

అవి బాకీలు కట్టగలిగే స్థితిలోనే ఉన్నాయి...

టెలికం మంత్రికి రిలయన్స్‌ జియో లేఖ

న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్‌ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్‌ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ ఆ రెండు సంస్థలకు ఏం జరిగినా(మూతబడినా).. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి నష్టమేమీ లేదని  పేర్కొంది.   

సీవోఏఐ బ్లాక్‌మెయిల్‌...
‘రెండు సంస్థల స్వార్థ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది’ అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ  బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్‌ ధోరణి కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్‌ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది’ అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ‘సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)’ లెక్కల్ని బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, రిలయన్స్‌ జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది.

భారత మార్కెట్‌ నుంచి తప్పుకోవడం లేదు: వొడాఫోన్‌
భారీ చెల్లింపులు జరపాల్సిన నేపథ్యంలో భారత మార్కెట్‌ నుంచి తప్పుకోబోతోందంటూ వచ్చిన వార్తలను బ్రిటన్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార వదంతులేనని పేర్కొంది. అలాంటి యోచనేదీ తమకు లేదని, స్థానిక మేనేజ్‌మెంట్‌కు పూర్తి మద్దతు ఇస్తామని వొడాఫోన్‌ తెలిపింది.   ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top