
పన్నులో ఏటా లక్ష దాకా ఆదా!!
మీల్ వోచర్స్, ఫ్యూయెల్ అలవెన్స్, గ్యాడ్జెట్ కొనుగోలు, బుక్స్, కమ్యూనికేషన్ అలవెన్స్..
• భత్యాల రూపంలో ఉద్యోగులకు ప్రయోజనాలు
• కంపెనీలతో కలిసి జీటా వినూత్న సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీల్ వోచర్స్, ఫ్యూయెల్ అలవెన్స్, గ్యాడ్జెట్ కొనుగోలు, బుక్స్, కమ్యూనికేషన్ అలవెన్స్.. ఇలా స్థాయినిబట్టి 51 రకాల పన్నులేని అలవెన్సులు, ప్రయోజనాలను భారత్‌లో పనిచేస్తున్న వివిధ కంపెనీల ఉద్యోగులు పొందొచ్చునని. వీటి ద్వారా ఏడాదికి రూ.లక్ష దాకా పన్ను ఆదా చేసుకోవచ్చని ‘జీటా’ సహ వ్యవస్థాపకుడు రామ్‌కి గడ్డిపాటి తెలియజేశారు. డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఉన్న తమ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా టెలినార్, స్పార్, టాటా ఏఐజీ వంటి 350 కంపెనీలకు చెందిన 40,000 పైచిలుకు ఉద్యోగులకు సేవలందిస్తున్నట్టు తెలియజేశారాయన.
జీటా పనిచేసేదిలా: కంపెనీల ఉద్యోగులకు జీటా సూపర్‌కార్డ్ అందజేస్తుంది. ప్రతి అలవెన్సుకు నిర్దేశిత మొత్తం జీటా యాప్‌లో వేర్వేరుగా కనిపిస్తుంది. జీటా సూపర్ కార్డు ద్వారా పెట్రోలు పోయించుకుంటే ఫ్యూయెల్ అలవెన్సు నుంచి ఈ మొత్తం తగ్గుతుంది. చేసిన ఖర్చులకు బిల్లు కావాలని కంపెనీ కోరితే.. బిల్లు కాపీని ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. దేశవ్యాప్తంగా 80 వేల పైచిలుకు వర్తకులతో జీటా చేతులు కలిపింది. జీటాతో భాగస్వామ్యం లేని వర్తకుల వద్ద ఏవైనా వస్తు, సేవలు పొందినట్టయితే బిల్లు కాపీని అప్‌లోడ్ చేయాలి.
4జీతో ఐఫోన్ విక్రయాలు జూమ్: టిమ్ కుక్
న్యూయార్క్: భారత్‌లో ఏర్పాటవుతోన్న హైస్పీడ్ (4జీ) నెట్‌వర్క్ వల్ల రానున్న కాలంలో అక్కడ ఐఫోన్ విక్రయాలు పెరగొచ్చని యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. ఇండియాలో హైస్పీడ్ నెట్‌వర్క్ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ యాపిల్ మొబైల్ హ్యాండ్‌సెట్స్ అంత మంచి పనితీరును కనబరచడం లేదని అంగీకరించారు. ‘జియో దేశవ్యాప్తంగా ఆల్-ఐపీ నెట్‌వర్క్ 4జీ కవరేజ్ ను ఏర్పాటు చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తోంది’ అని వివరించారు.