ఉబెర్ కారెక్కిన ‘టాటా’ ఫండ్! | Tata Opportunities Fund picks up stake in Uber | Sakshi
Sakshi News home page

ఉబెర్ కారెక్కిన ‘టాటా’ ఫండ్!

Aug 20 2015 12:54 AM | Updated on Sep 3 2017 7:44 AM

ఉబెర్ కారెక్కిన ‘టాటా’ ఫండ్!

ఉబెర్ కారెక్కిన ‘టాటా’ ఫండ్!

అమెరికాకు చెందిన ట్యాక్సీ యాప్ దిగ్గజం ఉబెర్‌లో టాటా గ్రూప్ సారథ్యంలోని ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్ భారీగా పెట్టుబడి పెట్టనుంది...

- ట్యాక్సీ యాప్ దిగ్గజంలో భారీ పెట్టుబడి...
- టాటా ఆపర్చూనిటీస్ ఫండ్ ద్వారా వాటా కొనుగోలు
రెండేళ్ల క్రితం భారత్‌లో ట్యాక్సీ యాప్ సేవలను ఆరంభించిన ఉబెర్... ప్రస్తుతం 18 నగరాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1.5 లక్షల మంది డ్రైవర్లు ఈ సంస్థతో జట్టుకట్టారు. కస్టమర్ల ట్రిప్పుల ప్రాతిపదికన నెలవారీగా 40 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ విభాగంలో ప్రస్తుతం దాదాపు 35 శాతం వాటాను ఉబెర్ చేజిక్కించుకున్నట్లు అంచనా. భారత్‌లో వచ్చే 6-9 నెలల్లో రోజుకు పది లక్షల ప్రయాణాల(రైడ్స్)ను లక్ష్యంగా పెట్టుకున్న ఉబెర్.. అదనంగా మరో బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,500 కోట్లు) మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించింది. హైదరాబాద్‌లో తాము అతిపెద్ద విదేశీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు కూడా ఉబెర్ పేర్కొంది.
 
న్యూఢిల్లీ:
అమెరికాకు చెందిన ట్యాక్సీ యాప్ దిగ్గజం ఉబెర్‌లో టాటా గ్రూప్ సారథ్యంలోని ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్ భారీగా పెట్టుబడి పెట్టనుంది. టాటా క్యాపిటల్ నిర్వహణలో ఉన్న టాటా ఆపర్చ్యూనిటీస్ ఫండ్(టీఓఎఫ్) ద్వారా వాటాలను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని టీఓఎఫ్ మంగళవారం వెల్లడించింది. అయితే, ఎంత వాటా తీసుకుంటోంది, పెట్టుబడి మొత్తం వంటి వివరాలను మాత్రం తెలియజేయలేదు. కాగా, ఉబెర్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ టైమ్స్ ఇంటర్నెట్ ఈ ఏడాది మార్చిలో దాదాపు రూ.150 కోట్లతో స్వల్ప  వాటాను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజా డీల్‌తో ఉబెర్‌లో పెట్టుబడిపెట్టిన రెండో భారతీయ సంస్థగా టీఓఎఫ్ నిలుస్తోంది.  టీఓఎఫ్‌కు ఇదే తొలి విదేశీ పెట్టుబడి కూడా. కాగా, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. ఉబెర్ పోటీ కంపెనీ అయిన ఓలా క్యాబ్స్‌లో వ్యక్తిగతంగా ఇప్పటికే పెట్టుబడి పెట్టడం విశేషం.
 
ఉత్సాహాన్నిస్తోంది..: ఉబెర్
‘ట్యాక్సీ సేవల రంగంలో ఉబెర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్న విజయపథం, వృద్ధికి మేం కూడా తోడ్పాటునందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా చైనా, భారత్‌లో ఉబెర్ దూసుకెళ్తోంది. సాంకేతికపరిజ్ఞానం ద్వారా ప్రజా రవాణాలో కోట్లాదిమందికి సరికొత్త సేవలను ఉబెర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా వేలాదిమంది తొలిస్థాయి ఎంట్రప్రెన్యూర్లకు(కారు డ్రైవర్లు, ఓనర్లు) ఆర్థికపరమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది.

ఈ సంస్థ అందిస్తున్న సేవలను గుర్తించే మేం పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాం’ అని టీఓఎఫ్ మేనేజింగ్ పార్ట్‌నర్(ఇండియా అడ్వయిజరీ టీమ్) పద్మనాభ్ సిన్హా పేర్కొన్నారు.  కాగా, ఇప్పటివరకూ టీఓఎఫ్ జింజర్ హోటల్స్, టాటా స్కై, వరోక్ ఇంజనీరింగ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, టాటా ప్రాజెక్ట్స్, టీవీఎస్ లాజిస్టిక్స్ తదితర సంస్థల్లో 40 కోట్ల డాలర్ల మేర(దాదాపు రూ.2,600 కోట్లు) పెట్టుబడులను పెట్టింది. భారత కార్పొరేట్ రంగానికి టాటా ప్రతీకగానిలుస్తుందని.. అలాంటి గ్రూపునకు చెందిన టీఓఎఫ్ తమ భాగస్వామిగా చేరుతుం డటం ఉత్సాహాన్నిస్తోందని ఉబెర్ ఇండియా హెడ్ అమిత్ జైన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement