ప్రభుత్వం చేతికి స్విస్‌ ఖాతాదారుల వివరాలు

Swiss Bank Account Holders List in Indian Government Hand - Sakshi

సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ/ బెర్న్‌: నల్లధనంపై కేంద్రం ప్రకటించిన పోరు క్రమంగా ఫలితాలనిస్తోంది. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులందరి ఆర్థిక లావాదేవీల వివరాలు సెప్టెంబర్‌ నుంచి ప్రభుత్వం చేతికి రానున్నాయి. గత ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు కూడా లభించనున్నాయి. ఆటోమేటిక్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏఈవోఐ) విధానం కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందజేయనున్నట్లు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (ఎఫ్‌డీఎఫ్‌) వెల్లడించింది. అటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివి. మురళీధరన్‌ కూడా ఈ విషయాలు లోక్‌సభకు తెలిపారు.

తొలి సెట్‌ సెప్టెంబర్‌లో లభిస్తుందని, ఆ తర్వాత నుంచి వార్షిక ప్రాతిపదికన స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల వివరాలు ప్రభుత్వం చేతికి వస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని భారత్‌కు స్విట్జర్లాండ్‌ అందిస్తోంది. తాజా వివరాలు దీనికి అదనంగా ఉంటాయి. ఏఈవోఐ కింద తమ ఖాతాదారుల వివరాలను బ్యాంకులు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆయా ఖాతాదారుల దేశాల పన్ను శాఖ అధికారులకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఆటోమేటిక్‌గా చేరవేస్తుంది. ఇందులో ఖాతాదారు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు మొదలైన వివరాలు ఉంటాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top