‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’  | slowdown impact on auto industry | Sakshi
Sakshi News home page

‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’ 

Aug 17 2019 8:44 AM | Updated on Aug 17 2019 8:46 AM

slowdown impact on auto industry - Sakshi

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్‌ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్‌ (ఎస్‌సీఎల్‌) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్‌ ఆగస్టు 15–18దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్‌ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్‌ డిమాండ్‌ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్‌ ఈ సందర్భంగా వివరించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్‌ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్‌ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరాచేసే ఎస్‌సీఎల్‌ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16,17న (2 రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్‌ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement