షేర్ల తనఖా తగ్గింది!

Shares mortgage declined - Sakshi

క్యూ3లో తగ్గిన ప్రమోటర్ల తనఖా

కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: ప్రమోటర్ల షేర్ల తనఖా గత ఏడాది డిసెంబర్‌ క్వార్టర్లో తగ్గింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల షేర్ల శాతం గత ఏడాది అక్టోబర్‌ క్వార్టర్లో సగటున 8.3 శాతంగా ఉంది. అది డిసెంబర్‌ క్వార్టర్లో 7.8 శాతానికి తగ్గినట్లు కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ తెలియజేసింది. డిసెంబర్‌ క్వార్టర్లో ప్రమోటర్లు రూ.1.98 లక్షల కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టారని, ఇది బీఎస్‌ఈ–500 సూచీ మార్కెట్‌ క్యాప్‌లో 1.47 శాతానికి సమానమని పేర్కొంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..,

బీఎస్‌ఈ 500 సూచీల్లోని 129 కంపెనీల ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టారు. వీటిల్లో తొమ్మిది కంపెనీల ప్రమోటర్లు తమ ప్రమోటర్‌ హోల్డింగ్స్‌లో 90 శాతం వరకూ షేర్లను తనఖాలో ఉంచారు.
    కొంతమంది ప్రమోటర్లు తమ మొత్తం వాటాలో 95 శాతం వాటా షేర్లను తనఖా పెట్టారు. బజాజ్‌ హిందుస్తాన్, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్, రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజనీరింగ్, జేబీఎఫ్‌ ఇండస్ట్రీస్, సుజ్లాన్‌ ఎనర్జీ, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌  ఈ జాబితాలో ఉన్నాయి.
    కొన్ని కంపెనీల తనఖా షేర్ల వాటా తగ్గింది. గ్రాన్యూల్స్‌ ఇండియా, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్సూమర్, బాంబే బర్మా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
    నిఫ్టీ సూచీలోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు తమ తమ వాటాలో 5 శాతానికి పైగా షేర్లను తనఖా పెట్టారు. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో 24.7 శాతం మేర తనఖా పెట్టారు. ఆ తర్వాతి స్థానాల్లో ఏసియన్‌ పెయింట్స్‌ (14 శాతం), ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (12.5 శాతం), మహీంద్రా అండ్‌ మహీంద్రా (5.8 శాతం), టాటా మోటార్స్‌ (5.3 శాతం), జీ ఎంటర్‌టైన్మెంట్‌ (4.57 శాతం) ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top