4 నెలల గరిష్టానికి సూచీలు

Sensex surges 466 points to close at 36487 points - Sakshi

చైనాతో సరిహద్దు వివాదం తగ్గుముఖం

సెన్సెక్స్‌ 466 పాయింట్లు అప్‌

156 పాయింట్లు పెరిగి 10,764కు నిఫ్టీ

నాలుగో రోజూ లాభాలే

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం çకలసి వచ్చింది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల దన్నుతో  సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి.  సెన్సెక్స్‌ 466 పాయింట్లు లాభపడి 36,487 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 156 పాయింట్లు ఎగసి 10,764 పాయింట్ల వద్ద ముగిశాయి.

శాతం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 1.29 శాతం, నిఫ్టీ 1.47 శాతం మేర పెరిగాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఈ నాలుగు రోజుల్లో ఈ సూచీలు చెరో 4.5 శాతం మేర ఎగిశాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి 2 పైసల నష్టంతో 74.68 వద్ద ముగిసింది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నా, కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) పెరుగుతుండటం సానుకూల ప్రభావం చూపుతోంది.  

► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 7 శాతం లాభంతో రూ.571  వద్ద ముగిసింది.  
► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు–బజాజ్‌ ఆటో,హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్తాన్‌ యూనిలివర్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ► దాదాపు 1200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఐడీబీఐ బ్యాంక్, ఐటీఐ,ఎస్కార్ట్స్, ఆర్తి డ్రగ్స్, టేస్టీ బైట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

రిలయన్స్‌ @ 12 లక్షల కోట్లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  జోరు కొనసాగుతోంది. గత శుక్రవారం రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇంటెల్‌ రూ.1,895 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది. ఇక  ఈ కంపెనీ తాజాగా జియోమీట్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో   ఇంట్రాడేలో 3.9  శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,858ను తాకిన  ఈ షేర్‌  చివరకు 3.5 శాతం లాభంతో రూ.1,851 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ మొత్తం 466 పాయింట్ల లాభంలో రిలయన్స్‌ వాటా మూడో వంతు(189 పాయింట్లు)కు పైగా ఉంది. ఇక రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.11,73,677 కోట్లకు ఎగసింది. భారత్‌లో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ గల కంపెనీ ఇదే. పార్ట్‌లీ పెయిడ్‌ రైట్స్‌ షేర్లను కూడా కలుపుకుంటే  ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12.14 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో రూ.867కు పడిపోయిన ఈ షేర్‌ మూడున్నర  నెలల్లోనే రెట్టింపునకు పైగా లాభపడింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top