ఇన్వెస్టెర్రర్‌! | Sensex rebounds from 400-pt loss as analysts cheer Budget | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టెర్రర్‌!

Feb 2 2018 1:00 AM | Updated on Aug 20 2018 5:20 PM

Sensex rebounds from 400-pt loss as analysts cheer Budget - Sakshi

స్టాక్‌ మార్కెట్‌... అంతలోనే అందలమెక్కిస్తుంది. ఆ ఆనందాన్ని ఆసాంతం ఆస్వాదించేలోపే అధఃపాతాళానికి తొక్కేస్తుంది. ఎందుకు పడుతుందో, ఎప్పుడు ఎగస్తుందో ఒక పట్టాన అర్థం కాని బ్రహ్మపదార్థం సెన్సెక్స్‌. గురువారం జైట్లీ వేసిన పన్ను ‘పాచిక’ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలి... అంతలోనే మళ్లీ లాభాల్లోకి రావడం వైకుంఠపాళిని తలపించింది!!

దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ద్రవ్యలోటు లక్ష్యం పెంపు గురువారం స్టాక్‌ మార్కెట్‌ను భారీ నష్టాల వైపు నడిపించాయి.  అయితే  దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల దన్నుతో చివరకు స్వల్పనష్టాలతో స్టాక్‌ సూచీలు గట్టెక్కాయి. స్టాక్‌ సూచీలు వారం గరిష్ట స్థాయికి పడిపోయాయి. సెన్సెక్స్‌ 36 వేల దిగువకు పడిపోగా, నిఫ్టీ 11,000 పాయింట్ల పైన ముగియగలిగింది.

లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగినంతసేపూ స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ట్రేడింగ్‌ చివర్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో కొనుగోళ్లు జరపడంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల నుంచి రికవరీ అయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58 పాయింట్ల నష్టంతో 35,907 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 11,017 పాయింట్ల వద్ద ముగిశాయి.  

పెరిగిన ద్రవ్యలోటు లక్ష్యం
రూ. లక్షకు మించిన స్టాక్‌ మార్కెట్‌ లాభాలపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధించాలనే అరుణ్‌ జైట్లీ ప్రతిపాదనతో సెన్సెక్స్‌ 463 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.5 శాతానికి పెంచడం, పదేళ్ల బాండ్‌ రాబడులు 7.5 శాతానికి ఎగియడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

అయితే పన్ను వసూళ్లు, గ్రామీణాభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు  సంబంధించి అంచనాలు ఆశావహంగా ఉండటం, మౌలిక రంగానికి అధికంగా నిధులు కేటాయించడం, రూ.250 కోట్ల  వరకూ టర్నోవర్‌ ఉన్న వ్యాపార సంస్థపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించడం ఒకింత సానుకూల ప్రభావం చూపించాయి.   

లాభాల్లోంచి నష్టాల్లోకి....
బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. మూలధన లాభాల పన్ను ప్రతిపాదన వరకూ లాభాల్లోనే కొనసాగింది. ఈ ప్రతిపాదన తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్‌ ఒక దశలో 292 పాయింట్లు లాభపడగా, మరో దశలో 463 పాయింట్లు నష్టపోయింది.

ఇక నిఫ్టీ ఒక దశలో 90 పాయింట్లు లాభపడగా, మరోదశలో 149 పాయింట్లు నష్టపోయింది. కాగా గతేడాది బడ్జెట్‌ రోజు సెన్సెక్స్‌ 486 పాయిం ట్లు, నిఫ్టీ 155 పాయింట్ల్ల చొప్పున లాభపడ్డాయి. ఫలితాలు బాగా ఉండటంతో ఎల్‌ అండ్‌ టీ 2.8 శాతం లాభపడి రూ.1,456 వద్ద ముగిసింది.  సెన్సెక్స్‌లో బాగా లాభపడిన రెండో షేర్‌ ఇదే.


సెన్సెక్స్‌ 32,000 పాయింట్లకు: బోఫా–ఎమ్‌ఎల్‌  
ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపు స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని విదేశీ బ్రోకరేజ్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌(బోఫా–ఎమ్‌ఎల్‌) వ్యాఖ్యానించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 32,000 పాయింట్లకు పతనమవుతుందని హెచ్చరించింది. బడ్జెట్‌ ప్రతిపాదనలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది.


ఐఎఫ్‌ఎస్‌సీకి నియంత్రణ సంస్థ
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ)లో నిర్వహించే ఆర్థిక సేవలన్నింటినీ పర్యవేక్షించేందుకు ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఉన్న ఐఎఫ్‌ఎస్‌సీలోని స్టాక్‌ ఎక్స్చేంజిల్లో లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రవాసీలకు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నుంచి  మినహాయింపులు, కార్పొరేట్‌యేతర పన్ను చెల్లింపుదారులకు తక్కువ స్థాయిలో 9% మేర కనీస ప్రత్యామ్నాయ పన్ను తదితర చర్యలను ప్రతిపాదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement