10,100 పాయింట్ల చేరువలో నిఫ్టీ

Sensex moves up 113 points, Nifty climbs above 10000 - Sakshi

32 వేల పాయింట్లపైకి సెన్సెక్స్‌... 348 పాయింట్లు అప్‌

నిఫ్టీ లాభం 112 పాయింట్లు.. 10,096 వద్ద ముగింపు

మూడు వారాల గరిష్టానికి సూచీలు

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు మినహా అన్నీ లాభాల్లోనే..  

గత రెండు రోజులుగా పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్‌ మార్కెట్‌ గురువారం పరుగులు పెట్టింది. సెన్సెక్స్‌ ఏకంగా 32 వేల పాయింట్లపైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,100 పాయింట్ల చేరువలో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కలసివచ్చాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 348 పాయింట్లు లాభపడి 32,182 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు నెలల్లో సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు ఎగియడం ఇదే మొదటిసారి. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 10,096 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద స్టాక్‌ సూచీలు మూడు వారాల గరిష్ట స్థాయిలో ముగిశాయి.

ఆగస్టు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు బాగుంటాయనే అంచనాలతో (మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి) ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో స్టాక్‌ సూచీలు లాభాల బాట పట్టాయి. పండుగల సీజన్‌ కారణంగా అమ్మకాలు బాగా ఉంటాయనే అంచనాలతో కన్సూమర్‌ షేర్లకు డిమాండ్‌ కనిపించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

ఇక వివిధ ఫార్మా కంపెనీలకు నియంత్రణ సంస్థల నుంచి ఆమోదాలు లభించడంతో ఫార్మా షేర్లు కళకళలాడాయని పేర్కొన్నారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ క్యూ2 ఫలితాలు బాగా ఉండటంతో ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు ఎగిశాయి.

ఆర్‌ఐఎల్‌ 4 శాతం అప్‌: నేడు (శుక్రవారం) క్యూ2 ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 4% వరకూ ఎగసి రూ.872.5 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన టీసీఎస్‌ షేర్‌ 1.9% పెరిగి రూ.2,548.55 వద్ద ముగిసింది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తమ దాద్రా ప్లాంట్‌కు ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్స్‌పెక్షన్‌ రిపోర్ట్‌ (ఈఐఆర్‌) పొందామని వెల్లడించడంతో సన్‌ ఫార్మా షేర్‌ 3% వరకూ పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వేదాంత, హిందాల్కో,  టాటా మోటార్స్, యాక్సిస్‌ బ్యాంక్, అరబిందో ఫార్మా, టాటా స్టీల్‌ 1–6% రేంజ్‌లో పెరిగాయి.

1.46 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్‌సూచీల భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.46 లక్షల కోట్లు పెరిగి రూ.137.56 లక్షల కోట్లకు ఎగసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top