పుల్వామా ప్రకంపనలు

Sensex Falls Over 200 Points, Nifty Near 10,650 - Sakshi

కొనసాగుతున్న ఎఫ్‌ఐఐ అమ్మకాలు

భగ్గుమన్న ముడి చమురు ధరలు మరింత పతనమైన రూపాయి

వరుసగా ఎనిమిదో రోజూ నష్టాలు

10,700 పాయింట్ల దిగువకు నిఫ్టీ

83 పాయింట్ల నష్టంతో 10,641 వద్ద ముగింపు

311 పాయింట్లు పతనమై 35,498కు సెన్సెక్స్‌

పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి ప్రకంపనలు స్టాక్‌ మార్కెట్లో ప్రతిధ్వనించాయి. ఫలితంగా స్టాక్‌ సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. స్టాక్‌ మార్కెట్‌ నష్టపోవడం ఇది వరుసగా ఎనిమిదో రోజు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావారణం నెలకొనడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు భగ్గుమం టుండటంతో  స్టాక్‌ మార్కెట్లో నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 83 పాయింట్లు క్షీణించి 10,641 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 311 పాయింట్లు పతనమై 35,498 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంక్, ఐటీ, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 2013, ఆగస్టు తర్వాత స్టాక్‌ సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఇదే మొదటిసారి.  

బ్యాంక్‌ షేర్లకు రేట్ల దెబ్బ
ఆర్‌బీఐ రెపోరేటును పావు శాతం తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంక్‌లు మాత్రమే వడ్డీరేట్లను తగ్గించాయి. వడ్డీరేట్లను వినియోగదారులకు బదలాయించే విషయమై ఈ వారంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌ అధినేతలతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమావేశం కానున్నారు. దీంతో బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

అక్కడ పండగ... ఇక్కడ దండగ  
ప్రపంచ మార్కెట్లలో పండగ వాతావరణం ఉన్నా మన మార్కెట్లో మాత్రం దండగ వాతావరణం కొనసాగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా– చైనా మధ్య తాజాగా వాషింగ్టన్‌లో చర్చలు ప్రారంభం కావడంతో ఆసియా మార్కెట్లు సోమవారం మంచి లాభాలు సాధించాయి. హాంగ్‌కాంగ్‌ సూచీ హాంగ్‌సెంగ్‌ 1.6 శాతం, జపాన్‌ నికాయ్‌ 1.8 శాతం, చైనా షాంగై సూచీ 2.6 శాతం, కొరియా కోస్పి 0.7 శాతం మేర పెరిగాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమైనా, ఆ తర్వాత లాభాల్లోకి ఎగసి, స్వల్ప లాభాలతో      ముగిశాయి.

6 లక్షల కోట్ల సంపద ఆవిరి
వరుస ఎనిమిది రోజుల నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ నెల 7న రూ.142.74 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌... సోమవారం నాటికి రూ. రూ.136.33 లక్షల కోట్లకు పడిపోవడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top