స్వల్ప లాభాలతో సరి

Sensex ends 86 points higher to 39,616, Nifty closes below 11,900 - Sakshi

హెచ్చుతగ్గులమయంగా ట్రేడింగ్‌

424 పాయింట్ల రేంజ్‌లో కదిలిన సెన్సెక్స్‌

86 పాయింట్ల లాభంతో 39,616 వద్ద ముగింపు

27 పాయింట్లు పెరిగి 11,871కు నిఫ్టీ

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 20 పైసలు నష్టపోవడం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ఒకింత  ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 423 పాయింట్ల మేర కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 86 పాయింట్ల లాభంతో 39,616 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు లాభపడగా, ఫార్మా, లోహ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 98 పాయింట్లు నిఫ్టీ 52 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా ట్రేడింగ్‌: సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. ఇలా లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. సెన్సెక్స్‌ ఏడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే, మార్కెట్లో ఏ రేంజ్‌లో ఒడిదుడుకులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 251 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ మరో దశలో 173 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 424 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

బడ్జెట్‌పైనే దృష్టి....
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేకపోవడంతో ఎంపిక చేసిన బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు లాభపడ్డాయని వివరించారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు, రానున్న కేంద్ర బడ్జెడ్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు.
 
స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో గట్టెక్కినా, వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్, లుపిన్, బేయర్‌ క్రాప్‌ సైన్స్, క్యాడిలా హెల్త్‌కేర్, మన్‌పసంద్‌ బేవరేజేస్, రాడికో ఖైతాన్, రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ఇన్‌ఫ్రా, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు హావెల్స్‌ ఇండియా, అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్, చంబల్‌ ఫెర్టిలైజర్స్, తదితర 30కు పైగా షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.  
► ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా షేర్లు శుక్రవారం కూడా 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. 14% నష్టంతో రూ.45 వద్ద ముగిసింది.  
► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 13 శాతం నష్టపోయి 15 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.74కు పతనమైంది. గత రెండు రోజుల్లో ఈ షేర్‌ 25 శాతం క్షీణించింది.   


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top