మందగమన భయాలతో నష్టాలు

Sensex ends 72 points lower at 40284, Nifty down 11 points  - Sakshi

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు

స్వల్పంగా పతనమైన రూపాయి 

72 పాయింట్ల నష్టంతో 40,284కు సెన్సెక్స్‌

11 పాయింట్లు పతనమై 11,885కు నిఫ్టీ  

ఆర్థిక మందగమన భయాలతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. దీంతో రెండు ట్రేడింగ్‌ సెషన్ల లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత వృద్ధి మందగించగలదన్న వివిధ సంస్థల నివేదికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు పతనమై 40,284 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 11,885 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్‌ బ్యాంక్, ఐటీ, ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన షేర్లు క్షీణించాయి.  

320 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనా, అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం వరకూ లాభ, నష్టాల మధ్య కొనసాగినా, ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోనే ట్రేడైంది. ఒక దశలో 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 135 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 320 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌ పూర్తికావడం, ఈ వారంలో ప్రధానమైన ఈవెంట్స్‌ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. కీలక వడ్డీ రేటును చైనా తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావంతో మన దగ్గర నష్టాలకు కళ్లెం పడిందని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూల వార్తలు రావడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి.  

లాభాల్లో టెలికం షేర్లు...
ఏ టెలికం కంపెనీని మూతపడనివ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభయం ఇవ్వడంతో టెలికం షేర్లు పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 7 శాతం లాభంతో 21 నెలల గరిష్ట స్థాయి, రూ.420ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.409 వద్ద ముగిసింది. వొడాఫోన్‌ ఐడియా 22 శాతం లాభంతో రూ.4.47కు చేరింది.  
n యెస్‌ బ్యాంక్‌ 4% నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
n గ్లెన్‌ మార్క్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ‘అమ్మెచ్చు’ నుంచి ‘కొనొచ్చు’కు అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేర్‌ 21% లాభంతో రూ.365 వద్ద ముగిసింది.  
n స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top