ముగిసిన నాట్కో ఫార్మా క్విప్ ఇష్యూ | Rs. 341 crore in the equation | Sakshi
Sakshi News home page

ముగిసిన నాట్కో ఫార్మా క్విప్ ఇష్యూ

Sep 16 2015 3:03 AM | Updated on Sep 3 2017 9:27 AM

నాట్కో ఫార్మా క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా రూ. 341 కోట్లు సమీకరించింది

రూ. 341 కోట్ల సమీకరణ

ఇష్యూ ధర రూ. 2,130
త్వరలో షేర్ల విభజన
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నాట్కో ఫార్మా క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా రూ. 341 కోట్లు సమీకరించింది. మంగళవారం సమావేశమైన డెరైక్టర్ల సమావేశంలో క్విప్ ఇష్యూ ధరను నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 5 శాతం తక్కువ ధరకు షేర్లను అర్హతకలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు అలాట్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూ. 2,243గా నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ కంటే రూ. 112 తక్కువగా రూ. 2,131కు షేర్లను కేటాయించడం జరిగింది. మొత్తం 16 లక్షల షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 341 కోట్లను సమీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సేకరించిన నిధులతో కంపెనీల విస్తరణ కార్యక్రమాలు, ఫ్లాంట్స్ ఆధునీకరణకు వినియోగించనుంది.

 రెండేళ్లలో వైజాగ్ యూనిట్ సిద్ధం
 విశాఖపట్నం రాంకీ సెజ్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ రెండేళ్లలో సిద్ధమవుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన యూనిట్ సివిల్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2017-18 ఆర్థిక ఏడాదికల్లా ఈ యూనిట్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  దీంతోపాటు హైదరాబాద్ యూనిట్‌ను సుమారు రూ. 150 కోట్లతో విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.

 ఐదు షేర్లుగా విభజన
 గడిచిన ఏడాది కాలంలో షేరు ధర భారీగా పెరగడంతో ప్రతీ షేరును ఐదు షేర్లుగా విభజించాలని కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్ 26న జరిగే కంపెనీ 32వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రూ. 2గా విభజించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. దీంతో పాటు కంపెనీ రుణ సేకరణ పరిమితిని రూ. 600 నుంచి రూ. 1,000 కోట్లకు పెంచడానికి ఈ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతి తీసుకోనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో షేరు రూ. 2225 వద్ద స్థిరంగా  ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement