
దక్షిణాఫ్రికాకు చెందిన ఔషధ సంస్థ ఆడ్‌కాక్ ఇన్‌గ్రాం హోల్డింగ్స్‌లో మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కొనుగోలు చేయనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం నగదు డీల్ రూపంలో రూ. 2,100 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆడ్‌కాక్‌లో నాట్కోకు గతంలో ఉన్న 0.80 శాతంతో కలిపి మొత్తం 35.75 శాతం వాటా (సుమారు 5,16,43,319 షేర్లు) దక్కుతుంది. దీని విలువ 226 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఆడ్‌కాక్ వేల్యుయేషన్ సుమారు 632 మి. డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లు
డీల్ తర్వాత కంపెనీలో బిడ్‌వెస్ట్ (64.25%), నాట్కో (35.75%) ప్రధాన వాటాదార్లుగా ఉంటాయి. 1890లో ఏర్పాటైన ఆడ్‌కాక్ ఇన్‌గ్రాం ప్రధానంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ తదితర 4 సెగ్మెంట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 536 మిలియన్ డాలర్ల ఆదాయం, 33.4% స్థూల మార్జిన్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించేందుకు, కొత్త ఆదాయ మార్గాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని తెలిపారు. కంపెనీకి గల సుదీర్ఘ చరిత్ర, బ్రాండ్స్‌పై గల నమ్మకానికి ఈ ఒప్పందం నిదర్శనంగా నిలుస్తుందని ఆడ్‌కాక్ సీఈవో ఆండ్రూ హాల్ తెలిపారు. ఈ డీల్ నాలుగు నెలల్లో ముగియవచ్చని అంచనా.