
క్యూ1లో స్వల్ప వృద్ధి
ఆదాయం 8,545 కోట్లు; 11% అప్
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,410 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 1,392 కోట్లతో లాభం స్వల్పంగా పెరిగింది. మరోవైపు సమీక్షాకాలంలో ఆదాయం 11 శాతం పెరిగి రూ. 7,673 కోట్ల నుంచి రూ. 8,545 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండంకెల స్థాయిలో ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్లో పనితీరు నిలకడగా ఉండటం, నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీ (ఎన్‌ఆర్‌టీ) పోర్ట్‌ఫోలియో పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు.
లెనాలిడోమైడ్ ఔషధం ధరలకు సంబంధించి అమెరికా జనరిక్స్ మార్కెట్లో ఒత్తిడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్పాదకతను మెరుగుపర్చుకుంటూ, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ, ప్రధాన వ్యాపార విభాగాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్ చెప్పారు. స్థూలకాయాన్ని తగ్గించే ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్‌ను వచ్చే ఏడాది భారత్ సహా పలు దేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు.
ఇదీ చదవండి: ‘ఆర్‌బీఐ రేట్ల కోత మ్యాజిక్ బుల్లెట్ కాదు’
మరిన్ని విశేషాలు..
విభాగాలవారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ వ్యాపారం సుమారు 10 శాతం పెరిగి రూ. 6,886 కోట్ల నుంచి రూ. 7,562 కోట్లకు చేరగా, ఫార్మా సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) సెగ్మెంట్ 7 శాతం వృద్ధితో రూ. 766 కోట్ల నుంచి రూ. 818 కోట్లకు పెరిగింది.
గ్లోబల్ జనరిక్స్ విషయంలో, కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 3,846 కోట్ల నుంచి రూ. 3,412 కోట్లకు తగ్గింది. లెనాలిడొమైడ్ సహా కొన్ని కీలక ఉత్పత్తుల ధరల తగ్గుదల ఇందుకు కారణమైంది.
ఎన్‌ఆర్‌టీ పోర్ట్‌ఫోలియో కలిపి యూరప్ మార్కెట్ రూ. 526 కోట్ల నుంచి రూ. 1,274 కోట్లకు చేరింది.
అయిదు కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం, ధరల పెరుగుదల వంటి అంశాల దన్నుతో భారత మార్కెట్ 11 శాతం పెరిగి రూ. 1,325 కోట్ల నుంచి రూ. 1,471 కోట్లకు చేరింది.