జియో దూకుడు: మళ్లీ టాప్‌లో

Reliance Jio tops 4G download speed in August TRAI - Sakshi

అత్యంత వేగవంతమైన 4జీ ఆపరేటర్‌గా జియో

సాక్షి, న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్‌జియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ చార్టులో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే  అప్‌లోడ్‌  స్పీడ్‌లో వోడాఫోన్‌ అగ్రభాగాన నిలిచింది.  ఆగస్టు మాసానికి సంబంధించిన గణాంకాలను టెలికం రెగ్యులేటరీ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసింది.  ఆగస్టు నెలలో 21.3 ఎంబీపీఎస్‌ సగటు డౌన్‌లోడ్ వేగంతో టాప్‌ లోఉంది జియో.  జూలైలో 21.0 ఎంబీపీఎస్‌తో పోలిస్తే మరికొంచెం మెరుగుపడింది.  మొత్తం 12 నెలల్లో అత్యధిక సగటు డౌన్‌లోడ్ వేగంతో రిలయన్స్ జియో 2018లో అత్యంత వేగవంతమైన 4 జీ ఆపరేటర్‌గా నిలిచింది.  కాగా ఈ ఏడాది మళ్ళీ మొత్తం 8 నెలల్లో జియో అగ్రస్థానంలో నిలిచింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రచురించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్‌టెల్ పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు. జూలైలో 8.8 ఎంబీపీఎస్‌ నుండి ఆగస్టులో 8.2 ఎంబీపీఎస్‌ పడిపోయింది. వోడాఫోన్,  ఐడియా సెల్యులార్ తమ వ్యాపారాలను విలీనం అనంతరం  వోడాఫోన్ ఐడియాగా పనిచేస్తున్నప్పటికీ, ట్రాయ్ వారి నెట్‌వర్క్ పనితీరును విడి, విడిగానే  ప్రచురించింది.

వోడాఫోన్ నెట్‌వర్క్‌లో సగటు 4జి డౌన్‌లోడ్ వేగం ఆగస్టులో 7.7 ఎంబీపీఎస్‌ వద్ద ఉండగా, ఐడియా జూలైలో సగటు డౌన్‌లోడ్ వేగం 6.6 ఎంబీపీఎస్‌ నుండి 6.1 ఎంబీపీఎస్‌కు తగ్గింది. వోడాఫోన్ ఆగస్టులో 4జీ అప్‌లోడ్ వేగం సగటు 5.5 ఎంబీపీఎస్‌ సాధించగా, జూలై నెలలో 5.8 ఎంబీపీఎస్‌నుంచి క్షీణించింది. ఐడియా, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఆగస్టులో సగటున 4 జి అప్‌లోడ్ వేగంలో వరుసగా 5.1, 3.1 ఎంబీపీఎస్‌ వద్ద స్వల్ప క్షీణతను నమోదు చేయగా, జియో 4.4 ఎంబీపీఎస్‌ సగటు అప్‌లోడ్  మెరుగుపడటం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top