ఆర్‌బీఐ రూటు ఎటు..?

RBI panel likely to keep key rates on hold - Sakshi

వడ్డిస్తారా.. వదిలేస్తారా..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల ప్రభావం

రేట్ల పెంపునకు అవకాశం ఉందంటున్న విశ్లేషకులు

6న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం

ముంబై: ఒకపక్క అంతకంతకూ ఎగబాకుతున్న ముడిచమురు ధరలు... మరోపక్క దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఆర్‌బీఐకి ఈసారి పాలసీ నిర్ణయం కత్తిమీద సాముగా మారనుంది. నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్న పరపతి విధాన సమీక్ష కమిటీ(ఎంపీసీ) భేటీలో పాలసీ రేట్ల నిర్ణయంలో ఈ రెండే కీలకం కానున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ నెల 6న(బుధవారం) పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడనుంది. కాగా, తాజాగా వెలువడిన నాలుగో త్రైమాసికం(క్యూ4) స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ బాటలో పయనిస్తోందన్న సంకేతాలు బలపడ్డాయి. 2017–18 క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతానికి ఎకబాకిన సంగతి తెలిసిందే.

గడిచిన ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇదిలాఉంటే... ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు ఇక ఆస్కారం లేదనేది నిపుణుల అభిప్రాయం.

ఆగస్టు నుంచీ అక్కడే...
2017 నవంబర్‌ నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం పైనే నమోదవుతూ వస్తోంది. వృద్ధికి ఊతమిచ్చే విధంగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి(2 శాతం అటూఇటుగా) కట్టడి చేయాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్ధేశించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల కారణంగానే 2017 ఆగస్టు నుంచీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగానే కొనసాగిస్తూ వస్తోంది.

ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.58 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతానికి ఎగబాకాయి. ప్రధానంగా ఇంధన ధరల పెరుగుదల దీనికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం రెపో రేటు(బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) 6 శాతం, రివర్స్‌ రెపో(ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌– బ్యాంకులు తమ డిపాజిట్‌ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణం) 4 శాతంగా ఉన్నాయి.

కాగా, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్రతిసారీ రెండు రోజుల పాటు భేటీ అవుతుంది. ఈసారి సమీక్షను మాత్రం మూడు రోజులు నిర్వహిస్తుండటం విశేషం.

పెంపు సంకేతాలు...!
తాజాగా పలు ప్రధాన బ్యాంకులు ఈ నెల 1 నుంచి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా మరికొన్ని బ్యాంకులు డిపాజిట్‌ రేట్లను కూడా ఇటీవలే పెంచాయి. ఇవన్నీ రానున్న కాలంలో ఆర్‌బీఐ రేట్ల పెంపునకు సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘మార్కెట్లో రేట్ల పెంపు సంకేతాలు ఉన్నప్పటికీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సరిపోతుందని మేం భావిస్తున్నాం’ అని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది.

జీడీపీ గణంకాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, ప్రైవేటు వినియోగం ఇంకా పడిపోతూనే ఉండటాన్ని(2016–17లో 7.3 శాతం నుంచి 2017–18లో 6.6 శాతానికి తగ్గింది) ఇందుకు ప్రధాన కారణంగా ప్రస్తావించింది. కాగా, ఇప్పటివరకూ అనుసరిస్తున్న సరళ పాలసీ విధానానికి ఇక తెరదించాల్సి ఉందంటూ గత పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య కూడా సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. గత భేటీలో మరో ఎంపీసీ సభ్యుడు మైఖేల్‌ పాత్రా అయితే రెపో రేటు పెంపునకు ఓటు వేశారు కూడా.

అయితే, ఐదుగురు సభ్యులు యథాతథానికే ఓటు వేయడంతో రేట్లలో ఎలాంటి మార్పులూ జరగలేదు. కాగా, ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరిగినప్పటికీ.. తక్షణం రేట్ల పెంపు ఉండకపోవచ్చ ని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఎండీ, సీఈఓ నరేశ్‌ టక్కర్‌ అభిప్రాయపడ్డారు. వృద్ధి అంచనాలను మించి పుంజుకుంటుండటం, ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో రానున్న కాలంలో రేట్ల పెంపునకు ఆస్కారం ఉందని చెప్పారు. పాలసీ సమీక్షలో ఈ సంకేతాలు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top