ఎక్కడిరేట్లు అక్కడేనా? | RBI may opt for status quo on interest rate | Sakshi
Sakshi News home page

ఎక్కడిరేట్లు అక్కడేనా?

Mar 31 2014 12:02 AM | Updated on Aug 24 2018 7:18 PM

ఎక్కడిరేట్లు అక్కడేనా? - Sakshi

ఎక్కడిరేట్లు అక్కడేనా?

ఒకపక్క ద్రవ్యోల్బణం దిగిరావడం, మరోపక్క పారిశ్రామికోత్పత్తి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎలాంటి పాలసీ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

 న్యూఢిల్లీ: ఒకపక్క ద్రవ్యోల్బణం దిగిరావడం, మరోపక్క పారిశ్రామికోత్పత్తి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎలాంటి పాలసీ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రేపు(ఏప్రిల్ 1న) వార్షిక పరపతి విధాన సమీక్షను ఆర్‌బీఐ చేపట్టనుంది. ప్రస్తుతానికి పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని, యథాతథంగానే కొనసాగే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణంలో ప్రధానంగా ఆహార వస్తువుల విభాగంలో ధరల తగ్గుదలపై కచ్చితమైన సంకేతాలు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పాలసీ నిర్ణయం ఆర్‌బీఐకి సవాలుగా నిలిచేదే. నా అభిప్రాయం ప్రకారం పాలసీ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచొచ్చు’ అని హెచ్‌ఎస్‌బీసీ కంట్రీ హెడ్ నైనాలాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ కూడా తమ తొలి ప్రాధాన్యం ద్రవ్యోల్బణం కట్టడేనంటూ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 రూపాయిపై దృష్టి...
 ద్రవ్యోల్బణం అంచనాలతోపాటు ఆర్‌బీఐ ఈసారి రూపాయి బలోపేతంపైనా దృష్టిసారించే అవకాశం ఉందని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకం విలువ బలపడుతుండటం(ప్రస్తుతం 59.91కి చేరింది)తో ఎగుమతులపై ప్రభావం పడనుండటమే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. విదేశీ నిధుల ప్రవాహం ఆసరాతో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు ఎగబాకుతుండగా... రూపాయి కూడా పటిష్టమయ్యేందుకు దోహదం చేస్తోంది. ఇదిలాఉండగా, ఇటీవల కురిసిన అకాల వర్షాల ప్రభావంతో స్వల్పకాలానికి ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగేందుకు దారితీయొచ్చనే అంచనాలున్నాయి.

 ఈసారికి ఆర్‌బీఐ పాలసీలో ఎలాంటి మార్పులూ చేయదని భావిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ చెప్పారు. ద్రవ్యోల్బణం అంచనాలను అనుగుణంగానే ఆర్‌బీఐ చర్యలుంటాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీ కేఆర్ కామత్ పేర్కొన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆర్‌బీఐ రేట్ల పెంపునకు అవకాశాల్లేవని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. అయితే, గత పాలసీల్లో అనూహ్య నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటే నిర్ణయం ఎటైనా ఉండొచ్చని పేర్కొంది.

 శాంతించిన ద్రవ్యోల్బణం....
 టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 9 నెలల కనిష్టమైన 4.68 శాతానికి దిగిరావడం తెలిసిందే. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 25 నెలల కనిష్టానికి(8.1 శాతం) తగ్గింది. మరోపక్క, జనవరిలో పారిశ్రామికోత్పత్తి  మూడు నెలల తిరోగమనం నుంచి బయటపడినప్పటికీ... వృద్ధి నామమాత్రంగా 0.1 శాతానికి పరిమితమైంది. తయారీ రంగం ఇంకా రివర్స్‌గేర్‌లోనే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ రానున్న సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపుపై కొందరు ఆశలు పెట్టుకున్నారు.
 
 పరిశ్రమల గగ్గోలు..
 మందగమనంతో అల్లాడుతున్న తమకు వడ్డీరేట్ల తగ్గింపుతో ఊరటనివ్వాల్సిందేనని పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. అధిక వడ్డీరేట్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని.. రానున్న సమీక్షలో కచ్చితంగా రేట్ల కోత చేపట్టాలని ఆర్‌బీఐని కోరుతోంది. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం రెండూ దిగొచ్చిన నేపథ్యంలో కనీసం అర శాతం రెపో రేటు తగ్గింపు ఉంటుందని భావిస్తున్నట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిరేటుకు చేయూతనివ్వడం, వ్యాపార సెంటిమెంట్‌ను పెంచేందుకు వీలుగా వడ్డీరేట్లను కనీసం అర శాతం తగ్గించడం అత్యంత ఆవశ్యకమని మరో పారిశ్రామిక మండలి అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ విజ్ఞప్తి చేశారు.
 
 రాజన్ రూటెటు..
 ఆర్‌బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ మూడుసార్లు పావు శాతం చొప్పున పాలసీ వడ్డీరేటు(రెపో రేటు- బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై చెల్లించాల్సిన వడ్డీరేటు)ను మొత్తం ముప్పావు శాతం పెంచారు. జనవరి సమీక్షలో రెపో పావు శాతం పెంచడంతో 8 శాతానికి చేరింది. మార్కెట్ వర్గాలతో పాటు అత్యధికశాతం మంది ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచకపోవచ్చని అంచనావేయగా, దీనికి భిన్నంగా రాజన్ రేట్ల పెంపుతో అవాక్కయ్యేలా చేయడం గమనార్హం. రెపోతో ముడిపడిఉన్న రివర్స్ రెపో(బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) రేటు ప్రస్తుతం 7 శాతం వద్ద ఉంది.

నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన మొత్తం) 4% వద్ద కొనసాగుతోంది. కాగా, ఆర్‌బీఐ అధికారికంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పాలసీ నిర్ణయాలకు ప్రామాణికంగా నిర్ధేశించుకోనప్పటికీ... దీనిపైనే అధికంగా దృష్టిసారిస్తోంది. ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణాన్ని వచ్చే జనవరినాటికి 8 శాతానికి, 2016 జనవరికల్లా 6 శాతానికి చేర్చాలనేది ఆర్‌బీఐ లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement