
న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు చెందిన వ్యాపార విభాగం ‘ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ’ (ఓఈఎం)లో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. ఈయన తన వ్యక్తిగత స్థాయిలో... సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్‌ను అందించారని ఓలా సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎంత మొత్తంలో ఈ పెట్టుబడి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విజయవంతంగా ఆచరణలోకి వచ్చేందుకు రతన్ టాటాకు ఉన్నటువంటి లోతైన అనుభవం, సలహాదారు హోదా ఓలా సంస్థ అభివృద్ధికి దోహదపడనుంది’ అని మాతృ సంస్థ ప్రకటించింది.
మరోవైపు ఓలా భాగస్వామ్య సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీలో సైతం 2015 జూలైలోనే ఈయన ఇన్వెస్ట్‌చేసి.. ఈ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టిన తొలి ఇన్వెస్టర్‌గా నిలిచారు. ఇక తాజా పెట్టుబడిపై స్పందించిన టాటా.. ‘విద్యుత్ వాహన రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ వృద్ధిలో ఓలా కీలకపాత్ర పోషించనుందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ విభాగంలోకి రతన్ టాటాను సలహాదారునిగా, పెట్టుబడిదారునిగా చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.