రైల్ షేర్లు రయ్.. | Railway stocks pick up speed ahead of Budget | Sakshi
Sakshi News home page

రైల్ షేర్లు రయ్..

Feb 21 2015 2:20 AM | Updated on Sep 2 2017 9:38 PM

రైల్ షేర్లు రయ్..

రైల్ షేర్లు రయ్..

రైల్వే రంగానికి చెందిన షేర్లు శుక్రవారం 20 శాతం వరకూ పెరిగాయి.

ముంబై:  రైల్వే రంగానికి చెందిన షేర్లు శుక్రవారం 20 శాతం వరకూ పెరిగాయి. ఈ నెల 26(వచ్చే గురువారం )న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ షేర్లు రయ్‌ను దూసుకుపోతున్నాయి. రైల్వే  రంగంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)కు పెద్ద పీట వేయనున్నదన్న అంచనాలతో రైల్వే రంగానికి చెందిన షేర్లు బాగా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. టిటాఘర్ వ్యాగన్స్ గత కొన్ని రోజులుగా బాగా పెరుగుతోంది.

ఇక ఇతర రైల్వే షేర్ల విషయానికొస్తే, సిమ్‌కో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.76 వద్ద, స్టోన్ ఇండియా 3 శాతం వృద్ధితో రూ. 94 వద్ద, కాళింది రైల్ నిర్మాణ్ (ఇంజినీర్స్ )2 శాతం వృద్ధితో రూ.161 వద్ద, టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ .4 శాతం వృద్ధితో రూ.162 వద్ద ముగిశాయి. నెట్‌వర్క్ విస్తరణకు, మెరుగైన సేవలందించడానికి రైల్వే రంగంలో 10,000 కోట్ల డాలర్లు అవసరమని రైల్వే మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగానికి తగినంత అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
 
టిటాఘర్ వ్యాగన్స్ జోరు
వ్యాగన్‌లు, కోచ్‌లు తయారు చేస్తోన్న  ప్రైవేట్ రంగ కంపెనీ,  టిటాఘర్ వ్యాగన్ షేర్ ధర శుక్రవారం  20 శాతం వృద్ధిచెంది రూ.662 వద్ద ముగిసింది.ఇది 52 వారాల గరిష్ట స్థాయి. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు 47 శాతం పెరిగింది. ఈనెల 16న రూ.438గా ఉన్న ఈ షేర్ ధర శుక్రవారం రూ.662కు చేరింది.  హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ సంస్థ 2.11 లక్షల టిటాఘర్ వ్యాగన్ షేర్లను శుక్రవారం కొనుగోలు చేయడం విశేషం. ఒక్క నెల రోజుల కాలంలో టిటాఘర్ షేర్ 65 శాతం,  మూడు నెలల కాలానికి 89 శాతం చొప్పున వృద్ధి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement