రూ.2.49 లక్షల కోట్ల రుణాల రద్దు | Sakshi
Sakshi News home page

రూ.2.49 లక్షల కోట్ల రుణాల రద్దు

Published Tue, Aug 8 2017 1:14 AM

రూ.2.49 లక్షల కోట్ల రుణాల రద్దు - Sakshi

ఇదీ... ఐదేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులు చేసిన పని 
అగ్ర స్థానంలో ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన రుణాలను ఖాతాల్లోంచి రద్దు చేసి పడేశాయి. ఆర్‌బీఐ గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులు సహా మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు కలిపి రూ.81,683 కోట్ల విలువైన మొండి బకాయిలను రద్దు చేశాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధికం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 41 శాతం ఎక్కువ. 2016–17లో ఒక్క ఎస్‌బీఐ, దానిలో విలీనమైన అనుబంధ బ్యాంకులు రద్దు చేసినవి రూ.రూ.27,574 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

 పీఎస్‌యూ బ్యాంకులు ఇలా రద్దు చేసిన రుణాలు 2012–13లో రూ.27,231 కోట్లు కాగా, అవి 2015–16లో రూ.57,586 కోట్లకు, 2016–17లో రూ.81,683 కోట్లకు పెరిగిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రద్దు చేసిన రుణాల్లో పీఎన్‌బీ రూ.9,205 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంకు రూ.5,545 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ.4,348 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు రూ.3,574 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు రూ.3,066 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.2,868 కోట్లు ఉన్నాయి. వసూలు కాని మొండి బకాయిలకు ఏటా ఇంత చొప్పున నిధులు కేటాయిస్తూ చివరికి బ్యాంకులు వాటిని రద్దు చేస్తుంటాయి. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల మొత్తం జారీ రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు 12.47 శాతానికి చేరాయి.

డర్టీ డజన్‌పై చర్యలను సమీక్షించిన బ్యాంకర్లు
ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (ఐబీసీ) కింద చర్యలకు ఆర్‌బీఐ నిర్ధారించిన 12 డర్టీ కంపెనీ అకౌంట్లపై చర్యలు ఎంతవరకూ వచ్చాయన్న అం శాన్ని ప్రముఖ బ్యాంకర్లు సోమవారం సమీక్షిం చారు. తగిన లిక్విడేషన్‌ ప్రక్రియకు ఉద్దేశించి ఈ 12 మొండిబకాయి అకౌంట్లను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలని ఆయా బ్యాంకర్లకు జూన్‌ 13వ తేదీన ఆర్‌బీఐ అంతర్గత సలహా కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. ‘‘పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్న నిర్ణయంలో భాగంగానే నేటి సమావేశం జరిగింది. అన్ని బ్యాంకుల మధ్య సన్నిహిత సహకారానికి దీనిని ఉద్దేశించడం జరిగింది’’ అని ఒక బ్యాంకర్‌ తెలిపారు.

12 అకౌంట్లూ ఇవీ...
ఎస్సార్‌ స్టీల్, భూషన్‌ స్టీల్, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్, ఆమ్‌టెక్‌ ఆటో, భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, మన్నెత్‌ ఇస్పాత్, ల్యాంకో ఇన్‌ఫ్రా, ఎరా ఇన్‌ఫ్రా, జేపీ ఇన్‌ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్‌ ఇందులో ఉన్నాయి. మొత్తం రూ. 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో ఈ 12 కంపెనీల వాటా దాదాపు పావుశాతం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ 12 సంస్థల్లో తొమ్మిదింటిని ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీకి రిఫర్‌ చేయడం జరిగింది. ల్యాంక్‌ ఇన్‌ఫ్రా, జేపీ ఇన్‌ఫాటెక్, ఎరా ఇన్‌ఫ్రా అకౌంటు మాత్రం ఇంకా పెండింగులో ఉన్నాయి.

22న బ్యాంకింగ్‌ సమ్మె!  
ప్రైవేటీకరణ, విలీనాలపై నిరసన

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనా లకు నిరసనగా ఈ నెల 22వ తేదీన సమ్మె నిర్వహించాలని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు సిబ్బం దికి పిలుపు నిచ్చాయి. విలీనాలు, ప్రైవేటీకరణ సహా బ్యాంక్‌ ఉద్యోగులు పలు బ్యాంకింగ్‌ వ్యతి రేక విధానాలపై  పోరాడుతున్నట్లు ఆల్‌ ఇండి యా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది.  9 బ్యాంక్‌ యూనియన్లకు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు ఏఐబీఈఏ నేతృత్వం వహిస్తోంది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం పేర్కొన్నారు. మొండిబకాయిలు రద్దు చేయకుండా ఈ బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నది తమ డిమాండ్లలో ఒకటని తెలిపారు.

Advertisement
Advertisement