రుణాల్లో 15 శాతం మొండివే!

PSBs' bad loans rise to 15% of gross advances in FY18: Government - Sakshi

పార్లమెంటులో కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2017–18 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రుణాల్లో 14.6 శాతానికి చేరాయి. ఆర్‌బీఐ గణాంకాలను ఉటంకిస్తూ పార్లమెంటులో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. దీనిప్రకారం 28%మొండిబకాయిలతో ఐడీబీఐ మొదటి స్థానంలో నిలిచింది.

ఎన్‌పీఏల్లో 90% 4,387 బడా రుణ బకాయిదారుల అకౌంట్లకు సంబంధించినవేనన్నారు. వీటి విలువ రూ.8.6 లక్షల కోట్లని తెలిపారు. మార్చి 2014లో ఎన్‌పీఏలు రూ.2.51 లక్షల కోట్లయితే, 2018 మార్చి చివరకు రూ.9.62 లక్షల కోట్లకు చేరాయి.  కాగా  ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై తగిన సలహాలు ఇవ్వాలని ఆర్‌బీఐకి కేంద్రం కోరినట్లు కూడా మంత్రి  వివరించారు.

బ్యాంకులపై ఆర్‌బీఐకి అధికారాలు...
బ్యాంకింగ్‌కు సంబంధించి ఏర్పడే విభిన్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన అధికారాలు అన్నీ రిజర్వ్‌ బ్యాంక్‌కు ఉన్నాయని మంత్రి శుక్లా పార్లమెంటుకు  ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘‘అధికారులను ప్రశ్నించవచ్చు. ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించవచ్చు. బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వవచ్చు’’ అని  తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్‌–టైమ్‌ డైరెక్టర్ల నియామకాలుసైతం ఆర్‌బీఐతో సంప్రతింపులతోనే జరుగుతున్నాయి’’ అని మంత్రి వివరించారు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పార్లమెంటరీ స్థాయి సంఘం (ఫైనాన్స్‌) ముందు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.

రూ.4,300 కోట్ల బినామీ ఆస్తుల జప్తు
ఆదాయపు పన్ను శాఖ జూన్‌ 30వ తేదీ నాటికి రూ.4,300 కోట్ల విలువపైన బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు  ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. బినామీ ఆస్తులు కూడగట్టే వారిపై చర్యలకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ శాఖ ప్రత్యేకంగా 24 బినామీ గుర్తింపు, నిరోధక విభాగాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీలపై ఫిర్యాదులు
ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్, ఇంజనీరింగ్‌ సంస్థ– లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)పై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్విస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ)కు ఫిర్యాదులు  అందినట్లు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి పీపీ చౌదరి వెల్లడించారు.

నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీపై కూడా ఎస్‌ఎఫ్‌ఐఓకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీపై ఫిర్యాదుల వివరాలను ఆయన వెల్లడించలేదు. గడచిన ఐదేళ్లలో 29 లిస్టెడ్‌ కంపెనీలను కేంద్రం ఎస్‌ఎఫ్‌ఐఓకు రిఫర్‌ చేసిందన్నారు. వీటిలో నాలుగింటిలో విచారణ పూర్తయ్యిందని, ప్రాసిక్యూషన్స్‌ ఫైల్‌ అయ్యాయని వివరించారు.  

విదేశీ కంపెనీల నుంచిపెరుగుతున్న పన్ను వసూళ్లు
2017–18 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో విదేశీ కంపెనీల నుంచి రూ.27,561 కోట్ల పన్ను వసూళ్లు జరిగినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 2016–17 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.24,541 కోట్లని ఈ సందర్భంగా వివరించారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top