కొత్త బ్యాంకులకు ఈసీ బ్రేక్? | Poll panel raises red flag on bank licence timing | Sakshi
Sakshi News home page

కొత్త బ్యాంకులకు ఈసీ బ్రేక్?

Mar 21 2014 12:38 AM | Updated on Aug 14 2018 4:32 PM

కొత్త బ్యాంకులకు ఈసీ బ్రేక్? - Sakshi

కొత్త బ్యాంకులకు ఈసీ బ్రేక్?

ఈ నెలాఖరులోగా కొన్ని బ్యాంకు లెసైన్సులు మంజూరు చేయాలని రిజర్వు బ్యాంకు భావిస్తుండగా, ఎన్నికల ముందుగా ఇలాంటి చర్యలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అడ్డుకుంటుందనే వార్తలు వినవస్తున్నాయి.

ముంబై: ఈ నెలాఖరులోగా కొన్ని బ్యాంకు లెసైన్సులు మంజూరు చేయాలని రిజర్వు బ్యాంకు భావిస్తుండగా, ఎన్నికల ముందుగా ఇలాంటి చర్యలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అడ్డుకుంటుందనే వార్తలు వినవస్తున్నాయి.  ఈసీ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి తెలిపారు. ‘లెసైన్సుల మంజూరుపై ఈసీ అభిప్రాయాన్ని కోరుతూ ఆర్‌బీఐ లేఖ రాసిందని మాత్రమే నాకు తెలుసు. ఈసీ నుంచి సమాధానం వచ్చిందో, లేదో నాకు తెలియదు. ఈ విషయంపై నిన్నటి వరకు నాకు ఎలాంటి సమాచారం లేదు...’ అని ఆయన గురువారం ముంబైలో విలేకరులతో చెప్పారు.

 ఎన్నికలకు ముందుగా లెసైన్సుల జారీకి ఈసీ అంగీకరించదనీ, కొన్ని అంశాలపై మరింత స్పష్టతను ఈసీ కోరుతోందనీ పేర్కొంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎన్నికల సీజను కంటే చాలాకాలం ముందుగానే లెసైన్సుల ప్రక్రియ మొదలైందనీ, కనుక ఈ వ్యవహారంలో ఈసీ జోక్యం చేసుకోబోదని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌లు గతంలో విశ్వాసం వ్యక్తం చేశారు. 2010-11 బడ్జెట్ నాటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, బ్యాంకింగ్ రంగంలో ప్రవేశానికి 26 కంపెనీలు దరఖాస్తు చేసుకోవడంతో గత జూలై నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. టాటా, మహీంద్రా గ్రూప్‌లు ఆ తర్వాత తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నాయి. ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐలతో పాటు అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకు లెసైన్సుకు దరఖాస్తు చేశాయి. లెసైన్సుల జారీపై ఈసీ అభిప్రాయాన్ని కోరుతూ ఈ నెల తొలివారంలో ఆర్‌బీఐ లేఖ రాసినట్లు సమాచారం.

 ఇండియా పోస్ట్‌కు లెసైన్సు కష్టమే?
 బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న కొన్ని పారిశ్రామిక సంస్థలకు నిరాశ ఎదురుకావచ్చని అంటున్నారు. వీటికి లెసైన్సులు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు సుముఖంగా లేఖ పోవడమే ఇందుకు కారణం. లెసైన్సుల ప్రక్రియ తుదిదశకు చేరుకున్నప్పటికీ, తుది ప్రకటన వెలువడడానికి మరింత సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. లెసైన్సులకు సంబంధించిన చర్చల్లో పలు వాణిజ్య సంస్థల ప్రస్తావన వచ్చింది.

 అయితే, ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని రిజర్వు బ్యాంకులోని కీలక వర్గాల అభిప్రాయం. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు ఏర్పాటు చేయడాన్ని అమెరికా, దక్షిణ కొరియాల్లో అనుమతించరు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, హాంకాంగ్‌లలో అనుమతి ఇచ్చినప్పటికీ యాజమాన్యం, ఓటింగ్ హక్కులపై నిబంధనలు విధిస్తారు. భారత్‌లో 1993, 2004 సంవత్సరాల్లో బ్యాంకు లెసైన్సులను మంజూరు చేసినపుడు వాణిజ్య సంస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. మరోపక్క, ఇండియా పోస్ట్ దరఖాస్తును పరిశీలించబోరనీ, ప్రభుత్వ యాజమాన్యంలోనిది కావడమే అందుకు కారణమనీ అంటున్నారు.

 నాలుగైదు సంస్థలకే లెసైన్సు?
 అన్ని వడపోతల తర్వాత నాలుగైదు సంస్థలకే లెసైన్సు దక్కవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఐడీఎఫ్‌సీతో పాటు రెండు ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలున్నాయి. ప్రైవేటు రంగంలోని సంస్థలకు మాత్రమే లెసైన్సులు జారీ చేయనున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు పలు దఫాలు సమావేశమయ్యారనీ, లెసైన్సులను ఏఏ సంస్థలకివ్వాలో ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. సంస్థల పేర్లను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను ఆమోదం కోసం ఆర్‌బీఐకి చెందిన సెంట్రల్ బోర్డు కమిటీ(సీసీబీ)కి పంపిస్తారు. సాధారణంగా వారానికోసారి సమావేశమయ్యే సీసీబీ, ఈ జాబితాకు ఆ మోదముద్ర వేయడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు సమావేశం కావాల్సి వస్తుంది. దీంతో లెసైన్సుల ప్రకటన జాప్యమయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement