పాలసీ సమావేశాలు  ఈ దఫా 3 రోజులు! 

Policy meetings this week is 3 days - Sakshi

జూన్‌ 4 నుంచి ప్రారంభం

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమావేశాలు ఈ దఫా మూడు రోజులు జరుగనున్నాయి. రెండవ ద్వైమాసిక  విధాన సమావేశం జూన్‌ 4, 5, 6 తేదీల్లో జరుగుతుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి ఈ సమావేశాలు జూన్‌ 5, 6 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే కొన్ని పాలనా పరమైన అవసరాల వల్ల మూడు రోజులు సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని ఆర్‌బీఐ తెలిపింది. సాధారణంగా రెండు రోజులు జరగాల్సిన సమావేశాలు మూడు రోజులు జరగడం ఇదే తొలిసారి.

 గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ సమావేశం–  బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం ఆరు శాతం)పై నిర్ణయం తీసుకోనుంది. గత ఏడాది ఆగస్టు నుంచీ రెపో రేట్లలో ఎటువంటి మార్పూ లేదు. ఇదిలావుండగా, జూన్‌ పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌శాక్స్‌ అంచనావేసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సమస్యలను ఇందుకు కారణంగా చూపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top