విదేశీ పెట్టుబడులు ఆకర్షించేది ఎలా..

PM Narendra Modi discusses strategies to promote investments - Sakshi

కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనుసరించతగిన వ్యూహాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పలు కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఫాస్ట్‌–ట్రాక్‌ పద్ధతిన విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, దేశీయంగా వివిధ రంగాలను ప్రోత్సహించేందుకు పాటించతగిన వివిధ వ్యూహాలపై ఇందులో చర్చించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే పెట్టుబడుల ఆకర్షణలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించేలా రాష్ట్రాల ప్రభుత్వాలకు తోడ్పాటు అందించడంపైనా విస్తృతంగా చర్చించినట్లు వివరించింది. ఇన్వెస్టర్లకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు అందేలా చూడటం, వారి సమస్యలను పరిష్కరించడం వంటి అంశాల్లో తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. వృద్ధిని వేగవంతం చేసే దిశగా సంస్కరణల పురోగతికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top