
సాక్షి, న్యూడిల్లీ: 2019 కొత్త ఏడాది ఆరంభంలో పేమెంట్ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు భారీ ఊరట లభించింది. గత ఏడాది నిలిచిపోయిన బిజినెస్‌ను పునఃప్రారంభించుకునేందుకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ్రీన్‌సిగ‍్నల్ ఇచ్చింది. ఈవాలెట్లను తెరుచుకునేందుకు, కొత్త కొస్టమర్ల నమోదుకు అనుతినిచ్చింది. దీంతో తన బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడానికి సంబంధిత వినియోగదారుల కేవైసీ ప్రాసెస్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.
వన్9 కమ్యూనికేషన్స్, విజయ్శేఖర్ శర్మ సహ యాజమాన్యంలోని పేటీఎం బ్యాంకులో కెవైసీ నిబంధనలు ఉల్లంఘనల ఆరోపణలతో గత ఏడాది జూన్‌లో కొత్త కస్టమర్లను నమోదును ఆర్‌బీఐ నిలిపివేసింది. అలాగే బ్యాంక్ సీఈవో రేణు సత్తిని తొలగించి, కొత్త సీఈవో, ఎండీగా సతీష్ గుప్తాను నియమించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 32 సంవత్సరాల అనుభవం కలిగిన సతీష్ గుప్తా ఒక అనుభవజ్ఞుడైన బ్యాంకరు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 42 మిలియన్ల ఖాతాలుండగా, 2019 చివరి నాటికి100మిలియన్ల వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.