
ఆర్‌ఐఎల్ రైట్స్ ఇష్యూకు భారీ స్పందన లభించింది
ముంబై : రూ 53,124 కోట్లతో తాము జారీచేసిన దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ విజయవంతంగా ముగిసిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్‌ఐఎల్) వెల్లడించింది. రైట్స్ ఇష్యూకు మదుపుదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇష్యూ 1.59 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని తెలిపింది. దేశ, విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లతో పాటు లక్షలాది చిన్న మదుపుదారులు ఈ ఇష్యూ పట్ల ఆసక్తి కనబరిచారు. రైట్స్ ఇష్యూలో ప్రజల వాటా 1.22 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయిందని ఆర్‌ఐఎల్ ప్రకటించింది. ఈనెల 10 నుంచి షేర్ల కేటాయింపు జరగనుంది.
జూన్ 12న రైట్స్ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వద్ద లిస్ట్ కానున్నాయి. రైట్స్ ఇష్యూపై కంపెనీ చేపట్టిన వినూత్న ప్రచారం మంచి ఫలితాలను రాబట్టింది. రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో ఆర్‌ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ రైట్స్ ఇష్యూలో పాల్గొన్న వాటాదారులకు ధన్యవాదాలు తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో రైట్స్ ఇష్యూ మైలురాయిలా నిలిచిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో సతమతమవుతున్న సమయంలో ఆర్‌ఐఎల్ రైట్స్ ఇష్యూ విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతమని ముఖేష్ అన్నారు.