
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ వాహన విభాగం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ(ఓఈఎమ్)లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ రూ.1,725 కోట్లు(25 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు ఓఈఎమ్ వెల్లడించింది. రూ.10 ముఖ విలువ గల పూర్తిగా, తప్పనిసరిగా మార్చుకునే సిరీస్ బి ప్రిఫరెన్స్ షేర్లను సాఫ్ట్‌బ్యాంక్ టొపాజ్ (కేమ్యాన్) లిమిటెడ్‌కు జారీ చేయడం ద్వారా రూ.1,725 కోట్లు సమీకరించామని ఓఈఎమ్ పేర్కొంది. దీంతో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన భారత సంస్థల్లో ఒకటిగా ఓఈఎమ్ చేరింది. సాఫ్ట్‌బ్యాంక్ ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్, జొమాటొ, పేటీఎమ్, ఓఈఎమ్ మాతృసంస్థ ఓలాలో కూడా పెట్టుబడులు పెట్టింది. కాగా ఓలాలో అతి పెద్ద సింగిల్ ఇన్వెస్టర్‌గా సాఫ్ట్‌బ్యాంక్ నిలిచింది.
రతన్ టాటా పెట్టుబడులు...
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. ఓఈఎమ్ సిరీస్ ఏ పెట్టుబడుల్లో భాగంగా రతన్ టాటా పెద్దమొత్తంలోనే ఇన్వెస్ట్ చేశారు. టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా సంస్థలు కూడా ఓఈఎమ్‌లో రూ.400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి.
పది లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు..
భారత్‌లో 2021 కల్లా పది లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంట్లో భాగంగా చార్జింగ్ సొల్యూషన్స్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, టూ, త్రీ,–ఫోర్ వీలర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకోవడం తదితర కార్యకలాపాలు చేపడుతోంది.