నిషేధంతో మరింత బిజినెస్‌: నాస్కామ్‌

Offshore services get demand due to H!-B visa ban - Sakshi

H1-B వీసాల నిషేధంతో కొత్త అవకాశాలు

ఆఫ్‌షోర్‌ సేవలకు పెరగనున్న డిమాండ్‌

క్యాప్టివ్‌ సెంటర్లలో మరిన్ని ఉద్యోగాలు

పరిశ్రమవర్గాల తాజా అంచనాలు

ఐటీ నిపుణులు అత్యధికంగా పొందే H1-Bసహా పలు వీసాలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం ద్వారా దేశీ ఐటీ కంపెనీలకు మేలే జరగనున్నట్లు  నాస్కామ్‌ తాజాగా అంచనా వేసింది.  దీంతో ఆఫ్‌షోర్‌ సర్వీసులకు డిమాండ్‌ పెరగనున్నట్లు సాఫ్ట్‌వేర్‌, ఐటీ సర్వీసుల సమాఖ్య నాస్కామ్‌ అభిప్రాయపడింది. కోవిడ్‌-19 కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగానికి బ్రేక్‌ వేసే బాటలో ఆ దేశ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ డిసెంబర్‌ వరకూ పలు వీసాలపై నిషేధం విధించిన విషయం విదితమే. అయితే యూఎస్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత కారణంగా పలు గ్లోబల్‌ దిగ్గజాలు దేశీ కంపెనీల ద్వారా సర్వీసులను పొందేందుకు ఆసక్తి చూపుతాయని నాస్కామ్‌ పేర్కొంది. ఇది ఐటీ రంగంలో మరిన్ని ఆఫ్‌షోర్‌ కాంట్రాక్టులకు దారిచూపుతుందని నాస్కామ్‌ ఆశిస్తోంది.

దిగ్గజాలు రెడీ
కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో పలు విదేశీ కంపెనీలు ఆఫ్‌షోర్‌ సేవలపట్ల ఆసక్తి చూపుతున్నాయని.. దీంతో ఇటీవల దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు బిజినెస్‌ పెరిగినట్లు నాస్కామ్‌ పేర్కొంది. ఐటీ రంగంలో కీలక(క్రిటికల్‌) సర్వీసులకు ఆఫ్‌షోర్‌ విధానంపై ఆధారపడటం పెరిగిందని తెలియజేసింది. కోవిడ్‌ సంక్షోభం నుంచి రికవరీ సాధించే బాటలో ప్రతీ దేశం టెక్నాలజీపై మరింత ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుందని నాస్కామ్‌ చైర్మన్‌, ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఇది దేశీ ఐటీ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ట్రంప్‌ H1-B వీసాలపై నిషేధం విధించడంతో ఆఫ్‌షోర్‌ కాంట్రాక్టులు పెరగనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఐటీ విశ్లేషకులు అమిత్‌ చంద్ర తెలియజేశారు.

క్యాప్టివ్‌ సెంటర్స్‌
సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు దేశీయంగా ఏర్పాటు చేసే క్యాప్టివ్‌ సెంటర్స్‌పై విదేశీ దిగ్గజాలు దృష్టి సారించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు సైతం పెరగనున్నట్లు అంచనా వేస్తున్నాయి. పలు గ్లోబల్‌ దిగ్గజాలకు దేశీయంగా 1300 క్యాప్టివ్‌ సెంటర్లున్నట్లు తెలియజేశాయి. వీటి ద్వారా దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. ఈ కేంద్రాల నుంచి సర్వీసులను పెంచుకునేందుకు మరింతమంది ఉద్యోగులను తీసుకునే వీలున్నట్లు ఏఎన్‌ఎస్‌ఆర్ కన్సల్టింగ్‌ సీఈవో లలిత్‌ ఆహుజా చెబుతున్నారు. కోవిడ్‌ కారణంగా 10-15 శాతం స్థాయిలో ఉద్యోగ కల్పనకు చాన్స్‌ ఉన్నట్లు అంచనా వేశారు. అంటే 2021కల్లా మొత్తం లక్షమంది వరకూ  నైపుణ్యమున్న సిబ్బందిని పెంచుకోవలసి ఉంటుందని వివరించారు. నిజానికి గత కొంతకాలంగా వీసాలను పొందడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా కొన్ని కంపెనీలు ఆఫ్‌షోర్‌ సేవలకే ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సాధిస్తున్న ఆదాయంలో ఆన్‌షోర్‌ వాటాను ఆఫ్‌షోర్‌ అధిగమిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top