
న్యూఢిల్లీ: ఆధార్ కోసం పట్టుబట్టకుండా ఇతరత్రా ఏ గుర్తింపు ధృవీకరణ పత్రం ఆధారంగానైనా టెలికం ఆపరేటర్లు కొత్త మొబైల్ కనెక్షన్లు ఇవ్వొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆధార్‌ను ఉపయోగించి ఆయా యూజర్లను రీ–వెరిఫికేషన్ చేసే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా కేంద్రం వేచి చూడనున్నట్లు ఆమె వివరించారు.
మరోవైపు, సిమ్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న విధానం ఇంకా అమల్లోనే ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆధార్ లేకుండా కొత్త సిమ్‌లు జారీచేసినప్పటికీ, తర్వాత దశలోనైనా వాటిని రీ–వెరిఫై చేయాల్సి ఉండొచ్చని పేర్కొన్నాయి. ఒకవేళ కనెక్షన్ తీసుకునేటప్పుడే సబ్‌స్క్రయిబర్.. ఆధార్ వివరాలు ఇచ్చిన పక్షంలో మళ్లీ రీ–వెరిఫికేషన్ అవసరం ఉండబోదని వివరించాయి.