
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (పాత ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన, ఆందోళన వ్యక్తమవుతుండగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇంధన ధరలపై సబ్సిడీ అమలు చేస్తే , ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాల అమలుపై పడుతుందని పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి వుందని ఇదొక అనివార్యమైన పరిస్థితిని అనీ గడ‍్కరీ వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ సబ్సిడీ కోసం డబ్బును ఉపయోగించినట్లయితే సంక్షేమ పథకాల అమలు ఇబ్బందిగా మారుతుందని ఒక ఇంటర్వ్యూలో గడ్కరీ తెలిపారు. పెట్రోలు ఎక్కువ ధరకు కొన్ని దేశంలో తక్కువ ధరకు కొనడం వల్ల ప్రభుత్వంపై అదనపు భార పడుతుందన్నారు. ప్రభుత్వం దగ్గర చాలా తక్కువ డబ్బు ఉందనీ దీన్ని పెట్రోల్, డీజిల్ ధరలపై సబ్సిడీకి వినియోగిస్తే తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. అయితే పన్నుల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకున్న ఆర్థికమంత్రిదేనని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా నిరంతరంగా పెరుగుతున్న ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్న డిమాండ్‌తోపాటు పెట్రోల్ లీటరు 100 రూపాయలకు చేరవచ్చనే ఆందోళన సర‍్వత్రా వినిపిస్తోంది. తక్షణమే ధరల నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మిథనాల్ మిశ్రమం కలపడం వల్ల పెట్రోల్ ధరలు దిగొచ్చే అవకాశం ఉందంటూ పలుమార్లు ప్రకటించిన నితిన్ గడ్కరీ ఇపుడు పెరుగుతున్న ధరలను భరించాల్సిందే అని ప్రకటించడం విశేషం.
మరోవైపు భగ్గుమంటున్న పెట్రోలియం ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని బీజేపీ చీఫ్ అమిత్ షా భరోసా ఇచ్చారు. ఇంధన ధరల నియంత్రణకు కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పెట్రోలియం మంత్రి, ప్రభుత్వరంగ చమురు సంస్థల ఉన్నతాధికారులతో చర్చిస్తోందనీ, వీలైనంతవరకు ధరలు తగ్గించాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అమిత్ షా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.