‘ఎక్స్-ట్రెయిల్’ హైబ్రీడ్ త్వరలో.. | Nissan bets on Datsun rediGO to crack small car market in India | Sakshi
Sakshi News home page

‘ఎక్స్-ట్రెయిల్’ హైబ్రీడ్ త్వరలో..

Jun 9 2016 12:55 AM | Updated on Sep 4 2017 2:00 AM

‘ఎక్స్-ట్రెయిల్’ హైబ్రీడ్ త్వరలో..

‘ఎక్స్-ట్రెయిల్’ హైబ్రీడ్ త్వరలో..

వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.

నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ గిల్ సికార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అలాగే ఆరు నెలలకో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెస్తామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గిల్ సికార్డ్ బుధవారం తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో నిస్సాన్ బ్రాండ్ డాట్సన్ రెడీ-గో అర్బన్ క్రాస్ కారును విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్ హైబ్రీడ్ ఎస్‌యూవీ కారును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పరిచయం చేస్తామని వెల్లడించారు. పెట్రోల్‌తోపాటు ఎలక్ట్రిక్ ఇంజిన్ ఉంటుందని, మైలేజీ లీటరుకు 20 కిలోమీటర్లు ఇస్తుందని సికార్డ్ తెలియజేశారు. ‘‘ఈ కార్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తాం. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిజానికి హైబ్రిడ్ కార్లు విజయవంతం కావాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. దీంతో పాటు ఛార్జింగ్ పాయింట్లను కూడా విరివిగా ఏర్పాటు చేయాలి. అప్పుడే అందరూ ముందుకొస్తారు’’ అని చెప్పారాయన.

 మార్కెట్ వాటా 5 శాతం..
దేశీయంగా విక్రయమవుతున్న నాలుగు కార్లలో ఒకటి చిన్న కారు ఉంటోందని సికార్డ్ తెలిపారు. ఎంట్రీ లెవెల్ విభాగం ప్రస్తుతం నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని , కంపెనీలు వినూత్న మోడళ్లను తీసుకొస్తే ఈ విభాగం మరింత వృద్ధి చెందుతుందని తెలియజేశారు. 2015లో నిస్సాన్ భారత్‌లో 40 వేల పైచిలుకు కార్లను విక్రయించింది. 2020 నాటికి వార్షిక అమ్మకాలు 2.50 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. తద్వారా 5 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంటామని సికార్డ్ తెలియజేశారు. డాట్సన్ రెడీ-గో విక్రయాలతో సంస్థ వాటా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వాల్యూ విభాగంలో డాట్సన్, హై ఎండ్‌పైన నిస్సాన్ ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. దేశీయ కార్ల విపణిలో నిస్సాన్ వాటా 2 శాతం లోపు ఉంది. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రెడీ-గో ధర వేరియంట్‌నుబట్టి రూ.2.43-3.40 లక్షలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement