డిజిటల్‌ మార్కెటింగ్‌ అడ్డా! | New starup Digital Academy 360 | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ మార్కెటింగ్‌ అడ్డా!

Oct 20 2018 1:16 AM | Updated on Oct 20 2018 1:16 AM

New starup Digital Academy 360 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం విద్య, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్‌ కంటే డిజిటల్‌ మార్కెటింగ్‌ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికగా ఎంచుకుంది ‘డిజిటల్‌ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ యోగేష్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

బెంగళూరులో మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తయ్యాక.. జిఫ్పీ ఎస్‌ఎంఎస్‌ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా చేరా. మూడేళ్లు పనిచేశాక.. సొంతంగా బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ కంపెనీ పెట్టా. ఆ తర్వాత అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీని కూడా! ఐదేళ్ల తర్వాత మార్కెటింగ్‌ రంగంలోని మార్పులు గమనించి.. దీన్నే వ్యాపార వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకొని నవంబర్‌ 2015లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా డిజిటల్‌ అకాడమీ 360ని ప్రారంభించా.

త్వరలోనే 10 రకాల కోర్సులు..
ప్రస్తుతం డిజిటల్‌ మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్‌ రెండు రకాల కోర్సులున్నాయి. వీటిల్లో 30కి పైగా సబ్జెక్స్‌ ఉంటాయి. ధర ఒక్క కోర్సుకు రూ.41 వేలు. ఇప్పటివరకు 20 వేలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వచ్చే ఏడాది కాలంలో 60 వేల మందికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది ముగిసే నాటికి ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మిషన్‌ లెర్నింగ్, యూఐయూఎక్స్, మొబైల్‌ డెవలప్‌మెంట్‌ వంటి 10 రకాల కోర్సులను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం ఆయా సబ్జెక్ట్స్‌లో మెటీరియల్‌ ప్రిపరేషన్‌ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం అమెజాన్, పేటీఎం, యాహూ, కేపీఎంజీ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం.
6 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రస్తుతం బెంగళూరు, పుణే, మైసూర్, ఢిల్లీ, నోయిడా, చెన్నై నగరాల్లో 21 శిక్షణ కేంద్రాలున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లను ప్రారంభించనున్నాం. ఆస్ట్రేలియా, దుబాయ్‌ దేశాల్లోనూ డిజిటల్‌ అకాడమీ 360 సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. ఆయా దేశాల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. స్థానికంగా ఒకటిరెండు ఫ్రాంచైజీ శిక్షణ సంస్థలతో కలిసి సెంటర్లను ప్రారంభించనున్నాం. మొత్తంగా ఏడాదిన్నరలో 50 సెంటర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం.

ఫ్రాంచైజీ రూ.25 లక్షలు..
స్టడీ మెటీరియల్స్, పరీక్ష పత్రాల తయారీ, శిక్షణ కోసం 60 మంది ట్రైనర్లున్నారు. ఏడాదిలో 200 మందికి చేరుకుంటాం. ప్రతి నగరంలో ఒక్క సెంటర్‌ మాత్రమే డిజిటల్‌ అకాడమీ 360ది ఉంటుంది. మిగిలినవి ఫ్రాంచైజీ రూపంలో ఉంటాయి. ఒక్క సెంటర్‌ ఫ్రాంచైజీ వ్యయం రూ.25 లక్షలు. ఇందులో శిక్షకుల సరఫరా, మార్కెటింగ్, మెటీరియల్‌ సప్లయి వంటివన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఫ్రాంచైజర్‌ స్థానికంగా ఉంటూ అకాడమీని నడిపిస్తే చాలు. మొదటి 3 నెలల పాటు రాయల్టీ ఉండదు. ఆ తర్వాత 12 నెలల వరకు నెలకు రూ.50 వేలు ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఆదాయంలో 12–25 శాతం వరకు వాటా ఉంటుంది.

రూ.40 కోట్ల నిధుల సమీకరణ..
గతేడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.9 కోట్లు లక్షి్యంచాం. డిజిటల్‌ అకాడమీ 360 కేంద్ర ప్రభుత్వం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ), గూగుల్‌ నుంచి డిజిటల్‌ మార్కెటింగ్‌ ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. ఈ డిసెంబర్‌ ముగింపు నాటికి రూ.40 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఏంజిల్‌ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి’’ అని యోగేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement