
పోటీపై అధ్యయనం పారదర్శకంగా ఉండేలా చూడాలి
కేంద్రానికి అంకురాల లేఖ
డిజిటల్ మార్కెట్లలో బడా టెక్ కంపెనీలు, పోటీ సంస్థలను దెబ్బతీసే విధానాలను ఉపయోగించకుండా ముందస్తుగా నివారించేలా ప్రత్యేక విధానాన్ని (ఎక్స్–యాంటీ) రూపొందించడం తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను దేశీ అంకుర సంస్థల వ్యవస్థాపకులు కోరారు. డిజిటల్ పోటీపై తలపెట్టిన మార్కెట్ అధ్యయనం పారదర్శకంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా ఉండేలా చూడాలని కోరారు. ఎక్స్–యాంటీ నిబంధనలను వ్యతిరేకిస్తూ గ్లోబల్ టెక్ దిగ్గజాలు దు్రష్పచారం సాగిస్తున్నాయని వివరించారు.
పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, మ్యాట్రిమోనీడాట్‌కామ్ ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్, ట్రూలీమ్యాడ్‌లీ సహ వ్యవస్థాపకులు స్నేహిల్ ఖనోర్, అమిత్ గుప్తా తదితరులు ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కి లేఖ రాశారు. డిజిటల్ మార్కెట్లలో పోటీని అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బిగ్ టెక్ సంస్థల వల్ల స్టార్ట్ వ్యవస్థ నిరంతరం సవాళ్లు ఎదుర్కొంటోందని అందులో పేర్కొన్నారు.
ఎక్స్–యాంటీ నిబంధనలను పునఃసమీక్షించడానికి ముందుగా ప్రస్తుత డిజిటల్ కాంపిటీషన్ బిల్లు ముసాయిదాను ఉపసంహరించి, మార్కెట్‌ను సవివరంగా అధ్యయనం చేయాలన్న ప్రభుత్వ యోచనను తాము స్వాగతిస్తున్నామని స్టార్టప్‌ల ఫౌండర్లు తెలిపారు. అయితే, ఇది స్వతంత్రంగా, పారదర్శకమైన విధంగా జరిగేలా చూడాలని కోరారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు